breaking news
B. Sambamurthy
-
ఆంధ్రా బ్యాంక్ చైర్మన్...ఎంపిక మళ్లీ మొదటికి
చైర్మన్‌గా ఉండటానికి నిరాకరించిన బి.సాంబమూర్తి తెలుగువాడిగా రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ళు ఉంటాయన్న భయమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ ఎంపిక ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. చైర్మన్ పదవి కోసం ఈ రంగంలో అపార అనుభవం ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి. సాంబమూర్తిని ఎంపిక చేస్తే ఆ పదవిని స్వీకరించడానికి ఆయన మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఈ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞత చెపుతూనే సాంబమూర్తి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘‘ఒక తెలుగువాడిగా ఈ పదవిని చేపడితే నా పైన స్థానిక వ్యాపారాలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయని, ఈ సమయంలో ఆంధ్రా బ్యాంక్ చైర్మన్‌గా పదవి చేపట్టలేనని’ సాంబమూర్తి ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవి ఎంపిక మొదటికొచ్చినట్లు అయ్యింది. భారీ నిర్థక ఆస్తులకు తోడు, రాష్ట్ర విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వివాదాల నేపథ్యంలో ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ పదవిని చేపట్టడానికి చాలామంది విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఫ్రభుత్వ ఖాతాల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు నెలకొన్న విషయం విదితమే. గత ఏప్రిల్ 30న సీఎండీగా సి.వి.ఆర్ రాజేంద్రన్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీఈవోగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాబ్యాంక్‌తో పాటు సుమారు పది ప్రభుత్వరంగ బ్యాంకుల చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఆంధ్రా బ్యాంక్...కొత్త చైర్మన్ ఖరారు!
బి. సాంబమూర్తి ఎంపిక! 9 పీఎస్‌యూ బ్యాంకుల చైర్మన్ల తుది జాబితా సిద్ధం ఎండీ సీఈవో పోటీలో 50 మంది బ్యాంకు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో పావు శాతం తగ్గనున్న ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టాల ఊబిలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ను గట్టెక్కించడానికి బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తికి చైర్మన్ బాధ్యతలను అప్పచెప్పనున్నారా? అత్యంత విస్వశనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న బులుసు సాంబమూర్తిని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. ఈయన్ను బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 1976లో సిండికేట్ బ్యాంకుతో వృత్తిని ప్రారంభించిన ఈ చార్టర్డ్ అకౌంటెంట్‌కు ఆ తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారీగా పెరిగిపోయిన ఎన్పీఏలతో సతమతవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను తెలుగువాడైన సాంబ మూర్తి గట్టెక్కించగలడని ఆర్థిక శాఖ గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్ రాజేంద్రన్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయటం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్రం సీఎండీ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పేరుతో రెండుగా విభజించింది. ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.కె కల్రాను మూడు నెలలపాటు తాత్కాలిక ఎండీ,సీ ఈవోగా నియమించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టు భర్తీపై దృష్టి సారించారు. దీంతో పాటు మరో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల ఎంపిక పూర్తి చేసిందని, త్వరలోనే ఈ జాబితాకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోద ముద్ర వేస్తారని తెలుస్తోంది. ఎండీ పోస్ట్‌కు డిమాండ్ వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో పోస్ట్‌లకు పోటీ చాలా అధికంగా ఉంది. సుమారు అయిదు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఎండీ, సీఈవో పోస్టుల కోసం 50 మందికిపైగా పోటీపడుతున్నారు. వీరిని ఎంపిక చేసే బాధ్యతను ఆర్బీఐ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ హే గ్రూపునకు అప్ప చెప్పింది. ప్రస్తుతం ఈడీగా ఉంటూ ఎండీ, సీఈవోగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కల్రా వారం రోజుల్లో జరిగే ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని, అందులో ఎంపికైతే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రాబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తగ్గింపుపై నేడోరేపో నిర్ణయం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు తగ్గింపుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ రెపో రేట్లను 75 బేసిస్ పాయింట్లకు తగ్గించినా ఇంత వరకు ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు చేరవేయలేదు. గురువారం సమావేశంలో బేస్ రేటును పావు శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25 శాతంగా ఉంది. ప్రచారంలో ఉన్న చైర్మన్ల జాబితా బ్యాంకు పేరు ప్రతిపాదిత చైర్మన్ ఆంధ్రాబ్యాంక్ బి.సాంబమూర్తి పంజాబ్ నేషనల్ సుమిత్ బోస్ ఓబీసీ జి.సి.చతుర్వేది కెనరా టి.ఎన్.మనోహరన్ బ్యాంక్ ఆఫ్ బరోడా రవి వెంకటేశన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జి.పద్మనాభన్ ఇండియన్ ఓవర్సీస్ ఎం.బాలచంద్రన్ విజయా బ్యాంక్ జి.నారాయణన్ ఇండియన్ బ్యాంక్ టి.సి.వి సుబ్రమణియన్