breaking news
auntys home
-
అత్తారింటికే కన్నమేశాడు!
పామిడి: అంగన్వాడీ కార్యకర్త ఇంటిలో చోరీ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. అత్తింటికే మేనల్లుడు కన్నమేశాడు. రూ.లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు, ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. వివరాలను మంగళవారం సాయంత్రం పామిడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. మంగళవారం ఉదయం పామిడి 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో గత నెల 17న పామిడిలో నివాసముంటున్న గజరాంపల్లి అంగన్వాడీ కార్యకర్త శైలజ కుమారి ఇంటిలో రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు, నగదు అపహరించుకెళ్లిన విషయం వెలుగు చూసింది. యువకుడిని గజరాంపల్లికి చెందిన నరిగమ్మగారి రఘునాథరెడ్డిగా గుర్తించారు. శైలజ కుమారికి మేనల్లుడవుతాడు. ఈ నెల 17న శైలజ కుమారి విధుల నిమిత్తం గజరాంపల్లికి చేరుకున్నప్పుడు ద్విచక్ర వాహనంపై పామిడిలోని అత్తింటికి చేరుకుని తలుపు తాళం బద్ధలుగొట్టి బీరువా తెరిచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేలతో పాటు ఏటీఎం కార్డు అపహరించుకెళ్లాడు. బంగారు ఆభరణాలను పామిడిలో విక్రయించేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ఏటీఎం కార్డు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన పామిడి సీఐ ఈరన్న, ఎస్ఐ చాంద్‌బాషా, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. -
అత్తింట్లో చోరీ..అల్లుడే దొంగ..!
ఖమ్మం: అత్తింటికే ఆ అల్లుడు కన్నం వేశాడు. ఆపై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వైనం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్య లచ్చా జీసీసీ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె, అల్లుడు కూడా స్థానికంగానే ఉంటున్నారు. అయితే, అల్లుడు లకావత్ శ్రీను మామ ఇంట్లో చోరీకి పథకం వేసుకున్నాడు. అందులో భాగంగానే ఆ ఇంటికి సంబంధించి మారు తాళం చెవి తయారు చేయించి సిద్ధంగా ఉంచుకున్నాడు. కాగా, అత్తింటి కుటుంబసభ్యులంతా కలసి తిరుపతి బయలుదేరగా అతడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అదేరోజు ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. భూక్య లచ్చా కుటుంబసభ్యులు ఈనెల 17వ తేదీన తిరుపతి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వేసిన తాళం వేసినట్లుగానే ఉండగా బీరువాలో ఉన్న రూ.7 లక్షల విలువైన 27 తులాల బంగారు ఆభరణాలు, రూ.24 వేల నగదు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన 18వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహన తనిఖీలు చేస్తుండగా లకావత్ శ్రీను నగలు విక్రయించేందుకు వెళ్తూ దొరికిపోయాడు. విచారణలో అతను దొంగతనం నేరాన్ని అంగీకరించాడు.