breaking news
Andipatti police
-
దినకరన్‌కు షాక్.. భారీగా నగదు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా తేని జిల్లా ఆండిపట్టిలో ఈసీ, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 1.48 కోట్ల నగదు పట్టుబడింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మునేట్ర కజగం(ఏఎంఎంకే) నేత నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్ పెట్టిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే సోదాలు మొదలు పెట్టారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ఏఎంఎంకే కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, డీఎంకే అభ్యర్థికి చెందిన రూ. 11.53 కోట్ల నగదు పట్టుబడటంతో వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఐటీ దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా రేపు జరగనుంది. (చదవండి: వెల్లూరులో ఎన్నిక రద్దు) -
హైకోర్టును ఆశ్రయించిన నటి
పెరంబూర్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందిగా నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ శుక్రవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు విదేశాలకు వెళుతున్నానని మదురై బెంచ్‌కు విన్నవించుకున్నారు. తన ప్రయాణానికి అనుమతి తెలపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఏ దేశానికి వెళ్లుతున్నారు, ఎక్కడ బస చేస్తారు లాంటి వివరాలను తమకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించిండంతో ఆమె కోర్టు అనుమతి కోరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24 నుంచి మే నెల 14వ తేదీ వరకు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం వెలువరించనుంది. తమిళనాడులో 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలతో కుష్బూపై ఆండిపట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆమె పాస్‌పోర్టును రెన్యూవల్ చేయడానికి అధికారులు నిరాకరించారన్నారు.