breaking news
Anandhra pradesh
-
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం
-
క్షణమొక యుగం
సాక్షి, తాడిపత్రి: సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎంతో ఉత్కంఠగా సాగాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతలు పూర్తయిన తరువాతనే ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడతగా ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈనేపథ్యంలో అభ్యర్థులు సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో వారిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. కౌటింగ్ సమయానికి ఇక రెండు రోజులే ఉండడంతో ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈవీఎంలలో తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 25 వరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వైఎస్సార్సీపీ నుంచి గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి, టిడిపి నుండి చంద్రబాబునాయుడులు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా 81.09శాతం ఓటింగ్ నమోదైంది. నిద్ర కరువు ఫలితాల కోసం 40 రోజులకు పైగా వేచి చూడాల్సి రావడంతో అభ్యర్థులకే కాదు వారి అనుచరులకూ నిద్ర కరువైంది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. కనీసం ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడకూడదని నిబంధనలు ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. పార్టీపరంగా చూస్తే తమ కార్యకర్తలతో అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఓట్లు పడ్డాయే...ఎక్కడ పడలేదో లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల నుంచి అభ్యర్థులు ఒక్కొక్కరూ ఒక్కో రకం ఫలితాలు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. సర్వేల మీద సర్వేలు పోలింగ్ సరళిని గమనించిన తర్వాత ఓటమి తప్పదని టిడిపి నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అయినా ఎక్కడో ఆశ మెదలుతోంది. దీంతో బూత్‌ల వారిగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఫోన్లు, ఇంటింటి సర్వేలు చేయించుకుంటున్నారు. తాడిపత్రిలో ఈసారి ఓటమి తప్పదనే వార్తలు వినిపిస్తుండంతో ఇప్పటికే మూడు సార్లు సర్వే నిర్వహించారు. ఎవరికి ఓటేశారు?ఎందుకు వేశారు? అంటూ నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. రోజుకు కనీసం మూడుమార్లు ఫోన్లు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తమకు ఓటేశారాని ఆరా తీస్తున్నారు. -
ముందడుగు
జిల్లాలో అక్షరాస్యత చిలకలూరిపేట రూరల్: సాక్షర భారత్ కార్యక్రమం అమలుతో జిల్లాలో అక్షరం వెలుగుతోంది. గత నాలుగేళ్లలో 2.53 లక్షల మంది చదవటం, రాయటం నేర్చుకున్నారు. ఫలితంగా అక్షరాస్యతలో నూతన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఆరవ స్థానం లభించింది. అక్షరాస్యతలో ముందుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని గుర్తించిన అధికారులు, సాక్షర భారత్ వలంటీర్లు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం సమైక్య రాష్ట్రంలో గుంటూరు జిల్లా 62.54 శాతం అక్షరాస్యతతో 11వ స్థానంలో ఉండగా 2011లో 67.99 శాతం అక్షరాస్యతతో 8వ స్థానానికి చేరింది. తాజా గణాంకాల ప్రకారం కొత్త రాష్ట్రంలో 6వ స్థానం దక్కించుకుంది. జిల్లాలో 2010 ఆగస్టు 15న సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, వలంటీర్ల కృషి కారణంగా నాలుగేళ్లలో జిల్లాలో అక్షరాస్యత 5.45 శాతం మేర పెరిగింది. పురుషుల్లో అక్షరాస్యత 74.79 శాతం కాగా మహిళల అక్షరాస్యత 60.09 శాతం. జిల్లాలోని 57 మండలాల్లోని 987 గ్రామ పంచాయతీల్లో 1974 సాక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2010లో గుర్తించిన నిరక్షరాస్యుల సంఖ్య 9.27 లక్షలు కాగా వీరిలో 4.40 లక్షల మంది పురుషులు, 4.87 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. గత నాలుగేళ్లలో మూడు దశల్లో 2,53,879 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. వీరిలో 53,334 మంది పురుషులు కాగా 2,00,545 మంది స్త్రీలు ఉండటం విశేషం. అక్షరాస్యతలో తెనాలి మండలం ప్రథమ స్థానంలో(79.89 శాతం) ఉండగా బొల్లాపల్లి మండలం 40.72 శాతంతో చివరి స్థానంలో ఉంది. 39 మండలాల్లో 60 నుంచి 80 శాతం అక్షరాస్యత ఉండగా మూడు మండలాల్లో(నూజెండ్ల, వెల్దుర్తి, బొల్లాపల్లి) 50 శాతం కన్నా తక్కువ ఉంది. 2017 నాటికి నూరుశాతం సాధిస్తాం.. జిల్లావ్యాప్తంగా 2010లో నిర్వహించిన కుటుం బ సర్వేలో 9.27 లక్షల మంది నిరక్ష్యరాస్యులు ఉన్న ట్లు గుర్తిం చాం. ఇప్పటివరకు 2,53,879 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం. 2017 నాటికి అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం. ప్రధానంగా మహిళలపై దృష్టి సారిస్తున్నాం. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా సోమవారం 987 గ్రామ పంచాయతీల్లో ఐదో విడత ప్రాథమిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 59,220 మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించాం. -ఎస్.శారద, డీడీ, వయోజన విద్య -
శివరామకృష్ణన్ గారూ... ఇక్కడంతా క్షామమే!
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) పదమూడు జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్‌కు అనువైన రాజధాని ఎంపిక కోసం రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ మా జిల్లాకొస్తున్న మీకు స్వాగతం. ఒక్క రాజధాని గురించే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పలు నగరాల్లో చేపట్టాల్సిన చర్యలను సూచించడంతో పాటు కొత్త రాష్ట్రానికి డజనుకు పైగా రానున్న కేంద్ర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో కూడా పరిశీలించమని మా ముఖ్యమంత్రి మిమ్మల్ని కోరినట్లు పత్రికల్లో చదివాం. సీమలో రాజధాని కావాలన్నది మా ఆశ. నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు తాగు, సాగునీరు, అవకాశమున్న చోట నలుగురికీఉపాధి కల్పించే పరిశ్రమలు, చిన్న చిన్న జబ్బులకు వైద్యం కోసం అటు బెంగళూరుకో, ఇటు కర్నూలుకో పరుగెత్తే అవసరం లేకుండా వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనను కోరుకుంటున్నాం. మా జిల్లాలో అధికార పార్టీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మంత్రివర్గంలోనూ ఇద్దరు స్థానం పొందారు. వారు గట్టిగా ప్రయత్నిస్తే జిల్లా అభివృద్ధి అందని ద్రాక్ష పండేం కాదు. అయితే వారు ప్రత్యర్థుల చీనీచెట్లు నరికించడంలోను, ప్రతిపక్ష పార్టీ వారి చౌకదుకాణాల డీలర్ షిప్పులను రద్దు చేయించడంలోనూ తీరిక లేకుండా ఉన్నారు. కాబట్టే జిల్లా అభివృద్ధి గురించి మీకు విన్నవించుకోవాల్సి వస్తోంది. మీరైనా మా కడగండ్లను కళ్లారా చూడండి. అదేం ఖర్మో కానీ.. ఈ జిల్లా సరిహద్దు దాటే వరకూ మేఘాలు వర్షించవు. రాష్ట్రంలోనే కాదు... మొత్తం ప్రపంచంలోనే అత్యల్పపాతం నమోదయ్యే పన్నెండు ప్రాంతాల్లో అనంతపురం ఒకటి. జిల్లా సగటు వర్షపాతం 552 మిల్లీమీటర్లు. గడిచిన పదేళ్లలో ఈ మాత్రం వర్షం కూడా కురవలేదు. రాజధాని వస్తుందంటున్న కృష్ణా, గుంటూరు.. వీటిని ఆనుకుని ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా మూడు కార్ల వరి పండుతుంటే... అనంతపురంలో మాత్రం మూడేళ్లకొక్కసారి కూడా వేరుశనగ పండని పరిస్థితి. జిల్లాలో సాగుకు అనుకూలమైన భూమి 12.5 లక్షల హెక్టార్లు ఉండగా.. సాగు మాత్రం ఏ సంవత్సరమూ పది లక్షల హెక్టార్లు మించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాలు ప్రశ్నార్థకంగా మారాయి. తుంగభద్ర జలాలు ఏ సంవత్సరమూ సక్రమంగా రావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర విభజన వల్ల ఈ జిల్లా నష్టపోయినంతగా ఏ జిల్లా నష్టపోలేదు. ప్రస్తుతం వెయ్యి అడుగుల బోరు వేస్తే ఒకటి..ఒకటిన్నర ఇంచుల నీళ్లు రావడం కష్టం. వాటిని పారించుకుందామనుకుంటే కరెంటు కోతలతో పావు ఎకరా తడవని పరిస్థితి. 2.10 లక్షల బోరుబావుల కింద సాగవుతున్న 1.57 లక్షల హెక్టార్లలో పంటల పరిస్థితి గాలిలో దీపంలా ఉంది. పవన విద్యుత్‌కు జిల్లా చాలా అనుకూలం. దీనికి తోడు పవర్‌గ్రిడ్ స్టేషన్లను నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తారని ఆశిస్తున్నాం. ‘మూగ’వేదనను అర్థం చేసుకోండి వాన పడక పంట పండకపోతే అప్పో సప్పో చేసి బతుకుతాం. లేదా పనులు వెతుక్కుంటూ పక్క జిల్లాలకో, రాష్ట్రాలకో పోతాం. అయితే.. ఇంటి ముందు పాడి ఆవు..లేగ దూడ..కట్టిన బర్రె.. మా కాళ్లకు బంధాలేస్తున్నాయి. వాటికింత ఎండుగడ్డి కూడా వేయలేని దుస్థితిలో ఉన్నాం. మాకు తాగడానికి మంచినీళ్లు.. మా పశువుల కింత మేత సమకూర్చే చర్యలు చేపడితే మీ మేలు మరవలేం. కన్నీటి కష్టాలు గుర్తించండి జిల్లాకు వరదాయినిగా భావించే హంద్రీ-నీవా మొదటి దశ పనులు పూర్తయినా కాలువల్లో చుక్క నీరు లేదు. తెలంగాణలోని ఎగువ ప్రాంతం నుంచి వచ్చే కృష్ణా జలాలలో ఒక్క టీఎంసీ కూడా ఇవ్వబోమని కేసీఆర్ సర్కారు తేల్చి చెప్పడంతో హంద్రీ-నీవాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక జిల్లాకు ముఖ్య నీటివనరుగా ఉన్న హెచ్ఎల్సీకి కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ప్రతియేటా విడుదల చేసే నీటిని సైతం నిలుపుదల చేయడానికి ఆ రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తుంగభద్ర బోర్డును సైతం రద్దచేయడానికి సిద్ధమైంది. ఇదే జరిగితే తుంగభద్ర జలాలపైనే ఆధారపడ్డ హెచ్ఎల్సీతో పాటు పీఏబీఆర్, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎండిపోవాల్సి వస్తుంది. వైద్యానికి చేయూతనివ్వండి జిల్లాలో ఆది నుంచి నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులో లేవు. జలుబు, జ్వరం తప్ప మరేపెద్ద రోగం వచ్చినా పొరుగునే ఉన్న కర్ణాటక లేదా కర్నూలుకు వెళ్లాలి. జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రి ఉన్నా అది రెఫరల్ ఆస్పత్రిగానే పనిచేస్తోంది. ఈ క్రమంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ‘ఎయిమ్స్’ లాంటి ైవైద్యవిజ్ఞాన సంస్థల ఏర్పాటుకు మీరు సిఫారసు చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాం. పారిశ్రామిక ప్రగతికి బాటలు వేయండి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు ఉన్నా.. నీటి సమస్య వేధిస్తోంది. పాలకుల నుంచి సరైన ప్రోత్సాహం లేక గుంతకల్లు స్పిన్నింగ్‌మిల్లు, అనంతపురంలోని డాల్డాఫ్యాక్టరీ, హిందూపురం నిజాం షుగర్స్ మూతపడ్డాయి. వీటిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. పాత వాటికే దిక్కులేకపోవడంతో కొత్త పరిశ్రమల స్థాపన కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం తాడిపత్రి, హిందూపురం ప్రాంతాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలతో పాటు చిన్నచిన్న పరిశ్రమల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునిస్తే ఫ్యాక్టరీల స్థాపనకు ఔత్సాహికులు ముందుకొస్తారు. ఆ దిశగా మీరు సిఫారసులు చేస్తారని ఆశిస్తూ.... - అనంతపురం జిల్లా ప్రజలు నేడు శివరామకృష్ణన్ కమిటీ సభ్యుల రాక అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం అధ్యయనానికి నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు సోమవారం జిల్లాకు రానున్నారు. కమిటీ సభ్యులు ఆరోమర్ రవి, జగన్‌షా, కేటీ రవీంద్రన్, కె.నితిన్‌తో పాటు కేంద్ర పట్టణ ప్రణాళిక డెరైక్టర్ తిమ్మారెడ్డి వస్తున్నారు. వారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి ఏడు గంటలకు అనంతపురంలోని ఆర్డీటీ అతిథిగృహానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని మేధావులు, ప్రజాసంఘాల నాయకుల నుంచి అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.