breaking news
Adulterated rice
-
మోర్ స్టోర్‌లో కల్తీ బియ్యం కలకలం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్‌లోని మోర్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన బియ్యంలో కల్తీ వచ్చాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వినియోగదారుడు సోమవారం ఆందోళనకు దిగాడు. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కర్నె శ్యాంసన్ కథనం ప్రకారం. జ్యోతినగర్‌లోని మోర్‌సూపర్ మార్కెట్లో శ్యాంసన్ ఇటీవల 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. అవి తిన్నప్పటి నుంచి పిల్లలు కడుపునొప్పి వస్తుందని తరచూ అంటున్నారని తెలిపారు. సోమవారం శ్యాంసన్ కుమారుడికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో అన్నాన్ని పరిశీలించిగా కల్తీ జరిగిందని గుర్తించారు. నేరుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లి నిర్వాహకులను నిలదీశాడు. పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఫుడ్‌సేప్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫుడ్‌సేప్టీ అధికారి రాజేంద్రనాథ్ సూపర్‌మార్కెట్‌కు వచ్చి వినియోగదారుడు శ్యాంసన్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం సూపర్ మార్కెట్లోని బియ్యం షాంపిల్స్ సేకరించుకొని వెళ్లారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించి కల్తీ జరిగిందని తెలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
పైన ఫైన్.. లోపల రేషన్
హన్మకొండటౌన్, న్యూస్‌లైన్ : సన్నబియ్యం అమ్మకాల పేరిట ప్రజలను మోసం చేసే వ్యాపారుల ముఠా ఒకటి నగరంలోకి ప్రవేశించింది. ట్రైసిటీలోని పలు కాలనీల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసిన ఈ ముఠా ఇప్పటికే పలువురిని మోసం చేసినట్లు తెలిసింది. తక్కువ ధరకు సన్నబియ్యం అందిస్తామంటూ ట్రాక్టర్, ఆటో ట్రాలీలపై బస్తాలను వేసుకుని ప్రచారం చేసి రేషన్ బియ్యం అంటగడుతూ పలువురు దొరికిన కాడికి దోచుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో సన్నరకం బియ్యం క్వింటాల్‌కు రూ.4500 నుంచి రూ.5వేలకు పైగా ధర పలుకుతోంది. అయితే రూ.5వేల ధర ఉన్న సన్నాలను తాము రూ.3500లకే ఇస్తామంటూ కొంతమంది ముఠా సభ్యులు ఇటీవల నగరవాసులకు గాలం వేస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే తక్కువ ధరకు మేలురకం బియ్యం తీసుకోవచ్చని భావిస్తున్న మహిళలు నకిలీ బియ్యం ముఠా మాటలను నమ్ముతున్నారు. అయితే తమను అనుమానంగా చూస్తున్న ఉద్యోగులు, మహిళలకు నమ్మకం కుదిర్చేందుకు వ్యాపారులు తమ సెల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తున్నారు. ఇంత తక్కువ ధరకు ఎలా బియ్యం అమ్ముతున్నారని ప్రశ్నిస్తే ధాన్యం తక్కువ ధర ఉన్నప్పుడు వేలాది క్వింటాళ్లలో తాము కొనుగోలు చేశామని, స్టాక్ పెట్టిన సమయం గడిచిపోవడంతో బియ్యం పాడైపోతున్నాయని.. మిల్లర్లు తమకు కమీషన్‌పై విక్రయించాలని అప్పగించినట్లు నమ్మబలుకుతారు. దీంతో అనుమానం నివృత్తి కావడంతో పలువురు క్వింటాళ్ల కొద్ది బియ్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బుధవారం హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్ సమీపంలో నివాసముంటున్న ముగ్గురు మహిళలు సుమారు రూ.25వేలకు పైగా చెల్లించి బియ్యం కొనుగోలు చేసి నష్టపోయారు. వీరిలో ఒకరు మూడు క్వింటాళ్లు, మరో ఇద్దరు రెండు క్వింటాళ్ల చొప్పున బియ్యం తీసుకున్నారు. కొనుగోలు సమయంలో బియ్యం బస్తాల నుంచి షాంపిల్ చూపించినప్పుడు సన్నరకం ఉన్నాయని, తర్వాత బస్తాలను విప్పి చూస్తే లోపల దొడ్డురకం రేషన్ బియ్యం ఉన్నాయని బాధితులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మోసానికి గురైన వారు వ్యాపారులు ఇచ్చిన సెల్‌నంబర్‌ను పట్టుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ నంబర్‌కు డయల్ చేయగా అది కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. తక్కువ ధరకు బియ్యం ఇస్తామని అన్నప్పుడే ఫిర్యాదు చేస్తే తాము వచ్చి చర్యలు తీసుకునే వారమని పోలీస్ అధికారులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తామని ఎవరైనా అంటే తమకు సమాచారం అందించాలని వారు చెప్పారు. కాగా, మార్కెట్లో ధరలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో తక్కువ ధర కు బియ్యం కొనుగోలు చేసి మోసపోవద్దని పోలీస్ అధికారులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు.