ఆ తూర్పు తలుపు తెరుచుకోనీ! | Sakshi
Sakshi News home page

ఆ తూర్పు తలుపు తెరుచుకోనీ!

Published Fri, Dec 23 2016 12:54 AM

ఆ తూర్పు తలుపు తెరుచుకోనీ! - Sakshi

సమకాలీనం
‘పుస్తకాలు లేకుండా నేను జీవించజాలను’ అంటాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి థామస్‌ జెఫర్సన్‌. ఒకప్పటితో పోల్చి చూస్తే పరిమాణంలో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు వస్తున్నా, అవి సమాజంపై చూపే ప్రభావం అంతంతే! దేశంలో, తెలుగునాట పేరు ప్రతిష్ఠలు గలిగిన కవులు, రచయితలు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు.. ఇలా అప్పట్లో అందరూ గొప్ప చదువరులు. నేటి తరం ఆంగ్ల భాష మోజుతో తల్లి భాష తెలుగునే ఖాతరు చేయడం లేదు.

‘‘హృదయ వికాసం జరుపకుండా మెదడుకు మాత్రమే అందించే విద్య అసలు విద్యయే కాదు’’           – గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌.

మానవేతిహాసంలో పరిణామాన్ని బట్టి వేర్వేరు కాలాల్లో విద్యను పలు విధాలుగా నిర్వచించారు. విద్య రానివాడు వింత పశువన్న భావన మొదలు.. విద్యయే అత్యంత శక్తివంతమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. విద్యావృద్ధికి పుస్తకం ఓ గొప్ప ఉపకరణమైంది. భావ వినిమయానికి భాష వృద్ధి చెంది, దానికొక శాశ్వతత్వం కల్పించే క్రమంలో పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయా కాలాల్లో వేర్వేరు రూపాల్లో అది విలసిల్లినా... అంతిమంగా పుస్తకమై కాల పరీక్షకు నిలిచింది. ఎదిగే సమాజ నిర్మాణంలో కీలకాంగమైంది. సంజ్ఞలు, శబ్దాలు, మౌఖిక సంభాషణల స్థితి నుంచి లిపి ఆవిర్భ వించింది. ఆపై... లోహాలు–రాళ్లపైన రాతలు, గోడరాతలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాగితం వరకు అనేక విధాలుగా ఈ ఉపకరణం రూపాంతరం చెందుతూ వచ్చింది. కాగిత పుస్తకం సుదీర్ఘకాలంగా రాజ్యమేలుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగాక ఇప్పుడు ఇంటర్‌నెట్, ఈ పుస్తకాలుగా దర్శనమిస్తున్నాయి.

సమాజ పరిణామ క్రమాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న కవులు, రచయితలు, నేతలు, బోధకులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు.... ఇలా ఎందరెందరికో పుస్తకం ఒక వాహకంగా, వేదికగా మారింది. భావ వ్యాప్తికి బలమైన అస్త్రమైంది. పఠనా సక్తిలో మార్పు, వాటిని బట్టే పుస్తకాలు వెలువరిం చడంలోనూ మార్పులొ చ్చాయి. వివిధ కాలాల్లో, సమాజాల్లో పుస్తకాల ఆదరణ, అనాదరణలో హెచ్చుతగ్గులున్నాయి. మధ్యలో పుస్తకాదరణ కొంత తగ్గినా... ఇటీవల మళ్లీ పుంజుకోవడం ఆశావహమని సామాజిక శాస్త్రవేత్తలంటున్నారు. పరిమాణా త్మకంగా పుస్తకాదరణ పరిస్థితి కొంత మెరుగైనా, ఏ రకం పుస్తకాల వైపు మొగ్గుతున్నారని పరిశీలించినపుడు బాధ కలుగుతుంది. జీవించడం నేర్పే సమాజశాస్త్రాల కన్నా, కవిత–కథ–నవల వంటి సాహితీ సృజనల కన్నా, చరిత్ర–జీవిత గాథలు వంటి స్ఫూర్తి పుస్తకాల కన్నా.. విద్యా–ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే సిలబస్‌ పుస్తకాలవైపు మొగ్గు పెరిగింది. కోర్సు– కెరీర్‌ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంసిద్ధం చేసే పుస్తకాల కొనుగోళ్లు పెరిగి నట్టు విక్రేతలు చెబుతున్నారు. మేధో వికాసపరమైనవే తప్ప హృదయగత మైన వికాసానికి దోహదపడే పుస్తకాలకు ఆదరణ తగ్గిపోయింది.

ఇక్కడా మార్కెట్‌ మాయాజాలమే!
ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ తర్వాత మానవాళి జీవన సరళిలో మార్పు లొచ్చాయి. అందుకు, మౌలిక ఆలోచనా ధోరణిలో మార్పులే కారణం. నూతన ప్రపంచావిష్కరణ క్రమంలో ప్రతిదీ మార్కెట్‌ శక్తుల ప్రభావాలకు లోనై, అదే దృష్టి కోణంలోనే చూడటం మొదలైంది. సామాజిక రంగాన్ని ఆర్థిక రంగమే శాసిస్తోంది. మన దేశంలోనూ తొంబయ్యో దశకం ఆరంభం నుంచీ ఈ పరిస్థితులు బలపడ్డాయి. తక్షణ ప్రయోజనం ఆశించే తత్వం అల వడ్డ సంస్కృతిలో, పౌరులెవరూ ఒక పరిధి దాటి ఆలోచించలేని స్థితి నెల కొంది. పాలకులు కూడా చరిత్ర వృథా! సాహిత్యం తిండి పెడుతుందా? ఇప్పుడు, ఎప్పటివో జీవిత చరిత్రల సంబద్ధత ఏమిటి? వంటి ప్రశ్నల్ని యువ మెదళ్లలో నాటుతున్నారు. విద్యతో ఉపాధి అవకాశాలు వెతుక్కునే యువ తరంలోనూ అటువంటి భావజాలమే! ఏం చదివి ఎక్కువ మార్కులు సాధిస్తే, పోటీ పరీక్షలు నెగ్గితే, ఏం ఉద్యోగం సంపాదించొచ్చు? ఎంత ఎత్తు ఎదగొచ్చు! ఏం సంపాదించొచ్చు? అన్న ఆలోచన తప్ప మరోటి స్పృహకు రావట్లేదు. ఇతరేతరమైనవి చదవడం సమయం వృథా తప్ప మరోటి కాదనే భావన! ఫలితంగా సమాజం పట్ల అవగాహనే లోపిస్తోంది.

విద్యార్థులు, బోధకులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు... అందరిదీ అదే ధోరణి. వెరసి, జీవన శైలిలో మంచి చెడుల్ని స్థిమితంగా ఆలోచించలేని వేగం పెరిగింది. అయిదారు వందల ఏళ్ల కిందట భాగవతంలో పోతన ఓ పద్యం రాస్తూ... ‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్‌ వివేక చతురత గల్గున్, చదువగ వలయును జనులకు...’ అని ప్రహ్లాదుడ్ని బడికి పంపేట ప్పుడు తండ్రి హిరణ్యకశ్యపునితో అనిపిస్తాడు. చదువు అంతిమ లక్ష్యాన్ని అత్యంత సూక్ష్మంగా చెప్పిన నిర్వచనమిది. మంచి–చెడుల్ని విడదీయగలిగే విచక్షణా జ్ఞానాన్ని చదువు ఇస్తుందనే స్పృహ ఇప్పుడు కొరవడింది. కారల్‌ మార్క్స్‌ ‘దాస్‌కాపిటల్‌’, మాగ్జిమ్‌ గోర్కీ నవల ‘అమ్మ’ వంటి పుస్తకాలు కోట్ల మంది ఆలోచనా సరళినే ప్రభావితం చేశాయి. తెలుగునాట అనువాద పుస్తకా లుగా ‘అమ్మ’తో పాటు ‘ఉక్కుపాదం’ (జాక్‌ లండన్‌ ‘ఐరన్‌ హీల్‌’), ‘ఏడు తరాలు’ (ఎలెక్స్‌ హేలీ ‘ది రూట్స్‌’) వంటి పుస్తకాలు లెక్కలేనంత మంది యువకుల్ని వామపక్ష ఉద్యమాల వైపు నడిపాయంటే అతిశయోక్తి కాదు. ‘..తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ...’ అన్న దాశరథి ఒక పద్యం ఓ ఉద్యమానికే ఊతకర్ర అయింది. ఒకప్పుడు బంగ రచయిత శరత్‌ తెలుగు వాడేమోననిపించేది. సామాజిక స్పృహతో సాగిన రచన ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ తరాలని ప్రభావితం చేస్తుందంటారు. ప్రాచీన చైనా తాత్వికుడు కన్ఫూసియస్‌ చెప్పినట్టు ‘భవి ష్యత్తును నిర్వచించాలంటే గతం చదవాల్సిందే!’

పఠనాసక్తికి శత్రువులెవరు?
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అన్నారు. మానవ సమాజాన్ని ఉన్నతీకరించడంలో పుస్తకం కీలకపాత్ర వహించింది. ఆలోచన పరిధిని విస్త రించింది. అవగాహనా స్థాయిని పెంచింది. మానవ సంబంధాల్ని మెరుగు పరిచింది. కాలక్రమంలో ఎందుకు ఆదరణ తగ్గింది? అనేకాంశాలు దీన్ని ప్రభావితం చేశాయి. మొదట సినిమా, తర్వాత టెలివిజన్, ఇప్పుడు ఇంట ర్నెట్, ముఖ్యంగా ఐటి ఆధారిత సామాజిక మాధ్యమాలు పుస్తక పఠనా భిరుచిపైన అనుకూల–ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సినిమాలొచ్చాక, ముఖ్యంగా టెలివిజన్‌ విస్తృతి పెరిగాక అనేక సాహితీ ప్రక్రియలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా కవిత్వం, కథ, నవల, నాటకం, చరిత్ర, జీవిత చరి త్రలు వంటి అనేక ప్రక్రియల పుస్తకాదరణ సాపేక్షంగా తగ్గింది. కారణా లేమైనా, ఇటీవలి అయిదారేళ్ల కాలంలో పరిస్థితి కొంతమేర మారింది. పుస్తక ప్రదర్శ నలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పెద్దనోట్ల రద్దు–కరెన్సీ తగి నంత అందు బాటులో లేకపోవడంతో ఈ సంవత్సరం కొంత ఇబ్బంది తలె త్తినట్టు ఇటీవల రాజమండ్రిలో జరిగిన పుస్తక ప్రదర్శన, ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రదర్శనలో కొనుగోళ్లను బట్టి తెలుస్తోంది. దేశంలో, ముఖ్యంగా తెలుగునాట సినిమా ఆధారిత వినోదమే ప్రధానాంశం.

అందుకే, టెలివిజన్‌ మాధ్యమాలు తమ వార్తేతర వినోద కార్యక్రమాల్లో సాహితీ ప్రక్రియల కన్నా సినిమా వస్తువుకే ఎక్కువ స్థానం కల్పిస్తున్నారు. లేదా ఇతరేతర చౌకబారు కార్యక్రమాల్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారు. ఎందుకీ పరి స్థితి అని ఎవరైనా విమర్శకులీ అంశాన్ని ఎత్తిచూపితే.. ‘విత్తుముందా? చెట్టు ముందా?’ వంటి తర్కం తెరపైకి వస్తుంది. పక్కనున్న తమిళ, కన్నడ రంగాల్లో ఉన్నపాటి మేలిరకం సరుకు కూడా తెలుగు చానళ్లలో ఉండదనే విమర్శ ఉంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలొచ్చాక మరింత దెబ్బపడింది. పరస్పర భావ వినిమయానికి, కాలక్షేపానికి, వ్యక్తీకర ణలకు ఇప్పుడవే వేదికలయ్యాయి. సృజన దారి మళ్లింది. ఈ మాధ్యమాల వల్ల ఉపయోగం కన్నా.. విద్యార్థులతో పాటు యువతరం, గృహిణులు, ఉద్యోగుల్లో తీవ్ర కాలహరణం జరుగుతోంది. నిరర్థకమైన సంభాషణలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనేది ఒక అధ్యయనం. ఫలితంగా పుస్తకాల మీద వెచ్చించగలిగే అరకొర సమయం కూడా మిగలని పరిస్థితి. ‘పుస్తకాల్ని దగ్ధం చేయడం కన్నా తీవ్రమైన నేరాలూ ఉన్నాయి, వాటిని చదవకుండా ఉంచడం అందులో ఒకటి’ అన్న జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ మాట అక్షర సత్యం.

పఠన–సృజన తగ్గితే భాషలకూ ద్రోహం
‘పుస్తకాలు లేకుండా నేను జీవించజాలను’అంటాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన మేధావి థామస్‌ జెఫర్సన్‌. ఒకప్పటితో పోల్చి చూస్తే పరిమాణంలో ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు వస్తున్నా, అవి సమాజంపై చూపే ప్రభావం అంతంతే! దేశంలో, తెలుగునాట పేరు ప్రతిష్ఠలు గలిగిన కవులు, రచయి తలు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయ కులు.. ఇలా అప్పట్లో అందరూ గొప్ప చదువరులు. ఇవాల్టి తరం ఆంగ్ల భాష మోజుతో తల్లి భాష తెలుగునే ఖాతరు చేయడం లేదు. కందుకూరి, గుర జాడ, పానుగంటి, గిడుగు, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరథి, వట్టికోట.. గొప్ప తెలుగు ప్రముఖులు ఎవరిని తీసుకున్నా, వారంతా ఇంగ్లిష్‌ తదితర అన్య భాషల్లోనూ ప్రావీణ్యం కలిగిన వారే! మాతృ భాషపై ఆధిపత్యం ఉన్న వారికే అన్య భాషలపైనా పట్టు లభిస్తుందన్నది విశ్వవ్యాప్తంగా రుజువైన సత్యం. అంటే, భాష ఏదైనా వారంత లోతుగా చదివారు కనుక గొప్ప రచనలు చేయ గలిగారు. ఇటీవలి సాహిత్యంలో, ఇతర సృజనల్లో అంతగా లోతు, ప్రభావశీ లత ఉండట్లేదనేది విమర్శ. చదివే వారు ఉంటేనే కదా, రాసే వారికి కాస్త ఉత్సాహం, ప్రోత్సాహం అనే భావనా ఉంది. ‘రాయగలిగిన వాళ్లు రాయాల్సి నంత రాయకపోవడంవల్ల, రాయకూడని వాళ్లు రాయకూడనంత రాస్తున్నా ర’ని ఇటీవల ఒక సమావేశంలో కవి శివారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  జర్న లిజంలో ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులై ఇంటర్వూ్యలకు హాజరైన 300 మందిలో పట్టు మని పదిమంది కూడా, సిలబస్‌కాని పుస్తకాలు చదివిన వారు లేరు. పుస్త కాలు చదివి ఉండకపోవడం లోపంగా కూడా వారు భావించడం లేదు.

మరో ఉద్యమం రావాలేమో?
ఆలెన్‌ బెన్నెట్‌ అన్నట్టు ‘ఊహాశక్తిని ఉద్దీపింపజేసే ఉత్ప్రేరకం పుస్తకం’. సామాజిక పరిణతి, మానవ సంబంధాల్లో ఉత్కృష్టత, మనిషి ఆలోచనల్లో విశాల దృక్పథం వంటివి మెరుగుపడాలంటే పఠనాసక్తి సజీవంగా ఉండాలి, పెరగాలి. తెలుగునాట ఉధృతంగా వచ్చిన గ్రంథాలయోధ్యమం వంటి మరో ఉద్యమమే రావాలేమో! ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని పాఠశాల, కళాశాల స్థాయిలో గ్రంథాలయాల్ని పరిపుష్టం చేయాలి. సిలబస్‌ను సమీ క్షించాలి. గతంలో తెలుగు, ఇంగ్లిష్‌ ఉపవాచకాలు (నాన్‌ డిటేయిల్‌) పిల్లల్లో పఠనాసక్తిని పెంచేవి. ఇప్పుడవి లేవు. మార్కుల వెంట పరుగులు తప్ప మరోటి లేదు. ఇంటర్నెట్‌–స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక గొప్ప సౌకర్యం ఏర్పడింది. ఒకప్పటిలా కాకుండా, ఉన్న చోటి నుంచి తన ఫోన్‌ ద్వారా కోరుకున్న పుస్త కాన్ని క్షణాల్లో స్క్రీన్‌ మీదకు రప్పించుకోగలిగే వెసులుబాటుంది. కేవలం ఒక విక్రయ అంగడిగా కాకుండా, ముందు వెనుక, ప్రదర్శన సమయంలో వివిధ ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ వారు చేస్తున్న కృషి అభినందనీయం. రష్యా–అమెరికా వారధిలాంటి వర్ధమాన రచ యిత్రి వెరా నజారియా చెప్పిన ఓ గొప్ప మాటతో ముగిస్తా. ‘నువ్వు ఓ మంచి పుస్తకం చదువుతున్నప్పుడే, మరింత వెలుగును లోనికి ఆహ్వానించే తలు పొకటి ప్రపంచంలో ఎక్కడో తెరుచుకుంటోంది’

(వ్యాసకర్త : దిలీప్‌ రెడ్డి ఈమెయిల్‌: dileepreddy@sakshi.com )

Advertisement
Advertisement