నన్ను కిందపడేసి కొట్టారు: కోటా శ్రీనివాసరావు

క్యారక్టర్‌ ఉన్న నటుడిని..!


కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు



అలనాటి చిత్రపరిశ్రమలో కీర్తిప్రతిష్టలే నటీనటుల బ్రాండ్‌గా ఉండేవని, వ్యక్తిత్వం కలిగిన.. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష కలిగిన నటీనటులు అప్పట్లో ఉండేవారని టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు చెప్పారు. క్యారెక్టర్‌ యాక్టర్లుగా కాకుండా యాక్టర్‌ విత్‌ క్యారెక్టర్‌గా అప్పటి చిత్రపరిశ్రమ సాగేదని. ఇప్పుడు సినీ పరిశ్రమకు ఆ క్యారెక్టరే లోపిస్తున్నట్లుందని పేర్కొన్నారు.



మంచితోపాటు చెడు కూడా సినిమారంగలో కొనసాగడం నిజమే కానీ వ్యక్తిగతంగా చెడిపోతున్నవారితో పాటు చిత్రరంగంలో కెరీర్‌ను జాగ్రత్తగా రూపొందించుకుంటున్న వారు కూడా నాడూ నేడూ చిత్రసీమలో చాలామందే ఉండేవారని, అలాంటివాళ్లను ఇప్పటి సినీ జనం ఆదర్శంగా ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నించారు.పర్సనల్‌గా పాడైపోయిన క్యారక్టర్లను చూస్తూ మన ప్రవర్తనను జాగ్రత్తగా మల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పుడెవరూ అలా అనుకోవడం లేదు కాబట్టే డ్రగ్స్‌ వంటి వ్యవహారాలు చిత్రసీమలో రాజ్యమేలుతున్నాయని చెబుతున్న కోటా శ్రీనివాసరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...



నటుడిగా గొప్ప రాజకీయ పాత్రలు పోషించారు. వాటికీ, వాస్తవానికి తేడా ఉందా?

1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే పది కోట్లు కావాలి. 20 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను.



మీరు నటించిన మండలాధీశుడు సినిమాతో వివాదం రేగింది కదా?

ఒకరకంగా దెబ్బతిన్నాను. విజయవాడ రైల్వేస్టేషన్‌లో నన్ను కిందపడేసి కొట్టారు. ఆ సినిమా చూసినవాళ్లెవరూ పెద్దగా మనసును కష్టపెట్టుకోలేదు. ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా తీశారని తెలిస్తే ఆయన అభిమానులు తట్టుకోవడం కష్టమే కదా. కానీ అంత వ్యతిరేకత వస్తుందను కోలేదు. నిజానికి ఆ సినిమాలో ఎన్టీఆర్‌ని తిట్టలేదు, కించపర్చలేదు. ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించాము. కానీ ఆ పాత్ర పోషణలో నటనలో నా వైపు నుంచి ఏమీ లోపం లేదు. కుర్రాళ్లు ఏదో ఆవేశంలో అలా చేశారు కానీ ప్రజలు ఆ పాత్రతో పెద్దగా మనసు కష్టపెట్టుకోలేదు.



మీపై దాడి ఎలా జరిగింది?

ఎన్టీఆర్‌ విజయవాడలో ఒక కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలోనే నేను పనిమీద స్టేషన్‌కు వచ్చాను. అక్కడ పెద్దసంఖ్యలో తెలుగుదేశం జెండాలు కనిపించాయి. అయ్యో ఈ సమయంలో వచ్చి ఇరుక్కున్నానే అనుకుంటూ ఒక పక్కకు వెళుతుండగానే నన్ను చూసి గుర్తుపట్టారు. కోటా గాడు వచ్చాడురా అంటూనే మీద పడి దాడిచేసి కొట్టారు. చాలా బాధపడిన సన్నివేశం.



ఎన్టీఆర్‌తో మీకు విభేదాలు ఏమీ లేవుకదా?

నా దురదృష్టం ఏమిటంటే నేను అందరితో నటించాను. ఆయనతో కలసి నటించే అవకాశం లేకుండా పోయింది. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. తేదీలు కూడా ఇచ్చారు. కాని ఎందుకో అది తప్పిపోయింది. మండలాధీశుడు సినిమా తర్వాత మద్రాస్‌ విమానాశ్రయంలో ఆయన్ని నేను కలిశాను. బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్‌ చెప్పి వస్తున్నారు. అదే మంచి సమయం అనిపించింది. చూసి నమస్కారం పెట్టాను. సీరియస్‌గా చూశారు. ‘‘మీరు మంచి కళాకారులని విన్నాను బ్రదర్‌. గాడ్‌ బ్లెస్‌ యూ. ఆరోగ్యం జాగ్రత్త. బీ కేర్‌ ఫుల్‌’’ అంటూ భుజం తట్టి.. వెళ్లి రండి అన్నారాయన. ఠక్కున ఆయన పాదాలకు దండం పెట్టి వచ్చేశాను. ఏంట్రా అంత ధైర్యంగా ఆయన ముందుకెళ్లావు. సాచిపెట్టి నిన్ను ఒకటి పీకి ఉంటే ఏమయ్యేది అని మావాళ్లంతా తర్వాత అడిగారు. నేననుకోవడం ఆయనకు అలాంటి కోపాలు ఏమీ లేవు. చుట్టూ ఉన్నవారంతా నామీద ఏవేవో చెప్పి ఎక్కించారు. నేను మా వాళ్లకు ఒకే మాట చెప్పాను. ఇలాంటి దిక్కుమాలిన వాళ్లందరి దగ్గర రోజూ తిట్లు తినే బదులు ఆయన్ను పలకరించి ఒక దెబ్బ తింటే అకౌంట్‌ క్లోజ్‌ అయిపోతుంది కదా అన్నాను.



నాటకాల్లో విశేషానుభవం ఉంది కదా. నాటకానికి, సినిమాకు తేడా ఏంటి?

సినిమాకు, నాటకానికి పెద్ద తేడా ఉంది. నాటకంలో మీరు రంగేసుకుని, మీసాలు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత చేసినా ఒకటి, రెండు, మూడు, నాలుగు అలా రోల్‌ వెనక్కు వెళ్లే కొద్దీ నటుడిగా మీరు ఫేడ్‌ అయిపోతుంటారు. అంటే తెరపై మీరు కనబడటం తగ్గిపోతుంది. అందుకే నాటకాల్లో చేతులు అటూ ఇటూ ఆట్టహాసంగా ఊపి, వాయిస్‌ పెంచి జిమ్మిక్కులు చేస్తుంటారు. దాన్నే నాటకీయత ఎక్కువైందిరా అంటుంటారు. అంటే తెరపై కనబడ్డం కోసం పాట్లు అన్నమాట అవి. అదే సినిమా విషయంలో.. ఒక కన్ను ఉందనుకోండి. అది రెండంగుళాలు. దాన్ని క్లోజ్‌ చేస్తే 35 ఎమ్‌ఎమ్‌లో కనబడుతుంది అంటే కన్ను చాలా చిన్నది కాని సినిమాలో అదే పెద్దసైజులో కనబడుతుంది. తేడా ఏమిటంటే సినిమాలో చిన్నదాన్ని పెద్దదిగా చూపిస్తారు. నాటకంలో పెద్దది చిన్నదిగా కనబడుతుంది. అదే సినిమాకు, నాటకానికీ తేడా.



ఆనాటి సినిమా, ఈనాటి సినిమా మధ్య తేడా ఏంటి?

ఆ రోజుల్లోనూ నిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమాను వ్యాపారపరంగానే తీసినప్పటికీ సంఘంలో మనకు ఒక బాధ్యత ఉందనే భావన ఉండేది. భాషలో కానీ, సీన్లు తీసేదాంట్లో కాని ఒక సభ్యత ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయిందనే పేరుతో ఈ యూత్‌ అంతా ఇష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తున్నారు అని మనం అన్నామనుకోండి.. పాత చింతకాయపచ్చడి నువ్వేంట్రా అంటారు. అందుకే దాదాపు అయిదేళ్లుగా చూస్తున్నాను. సినిమా ఇవ్వాళ తన సారాన్ని బాగా కోల్పోయింది. ఒకప్పటి సినిమా ఇప్పుడు లేదు. Výæతంలో సినిమా అంటే వ్యాపారంతో కూడుకున్న బాధ్యత. ఇప్పుడు సినిమా అంటే కేవలం వ్యాపారం.



కానీ సినిమాలు ఆడటం ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది కదా?

ఉదాహరణకు.. బాహుబలి సినిమా ఉంది. వాళ్లు ఇంత ఖర్చయింది అని చెప్పుకున్నారంటే అర్థముంది. ఎంత రిచ్‌గా తీశారో చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది. అలా ఎవరినయినా తీయమనండి చూద్దాం. టెక్నికల్‌గా ఖర్చు పెరిగింది అంటున్నారు. ఏం పెరిగింది టెక్నికల్‌గా. విఠలాచార్య కంటే గొప్పవారా వీళ్లంతా. ఆయన వద్ద ఉన్న ఎక్విప్‌మెంట్‌ చాలా చిన్నదిగా ఉండేది కానీ దాంతోనే అంత పెద్ద సినిమాలు చూపిం చారు. మాయాబజార్‌ చూడండి. ఈ రోజుల్లో కూడా ఆ సినిమాను విడుదల చేస్తే జనంలో ఎంత స్పందనో మరి. ఇప్పుడు కొత్త సినిమా విడుదలైతే మహా అంటే నెల రోజులు చెప్పుకుంటారు. తర్వాత మర్చిపోతున్నారు. కానీ పాత సినిమాలు టీవీల్లో చూస్తుంటే ఎంత గొప్పగా ఉంటాయో కదా. మాయాబజార్‌లో భోజనానికి కూర్చుంటే తివాచీ మడత పడటం, వీళ్లు వెనక్కు తోయడం, మళ్లా మడతపడటం అవే దృశ్యాలను ఇప్పుడు తీయమనండి చూద్దాం.



టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే అంత గొప్ప షాట్లు చేశారు కదా?

వాళ్లంతా మహానుభావులండీ.. ఎందుకు వారంత గొప్పవారయ్యారంటే సినిమాను సినిమాగా అర్థం చేసుకున్నారు. సినిమా అంటే మేకింగ్‌ బిలీవ్స్‌.. నమ్మించడమే సినిమా. అంతేగాని రోడ్లమీద పడి గంతులేసి ఆడమని కాదు.



సినిమాల్లో కొందరు డ్రగ్స్‌ బానిసలు అయిపోయారు. ఇది సమాజానికి నష్టం కాదా?

సినిమా అంటేనే చెడు ఎక్కువ. అయితే వ్యక్తిగతంగా చెడిపోయేవాళ్లు అప్పుడూ ఉండేవారు. ఇప్పుడూ ఉంటున్నారు. అప్పట్లోనూ పెద్దపెద్దవాళ్లు కొంతమంది తాగి చెడిపోలా? ఈ రోజు కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండటానికి కారణం ఏమిటి? నాకెవరూ చెప్పక్కర్లా. చెడిపోయిన వారు ఎదురుగుండానే కనబడుతున్నారు. పర్సనల్‌గా పాడైపోయిన క్యారక్టర్లు మన కళ్లముందే ఉన్నారు. అలాంటి వాళ్లను చూస్తూ మన ప్రవర్తనను జాగ్రత్తగా మల్చుకునే అవకాశం ఉంది. కానీ అలా అనుకోవడం లేదిప్పుడు.


ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీసిన మండలాధీశుడు సినిమాలో ఎలా నటిస్తావంటూ ఆయన అభిమానులు విజయవాడ రైల్వేస్టేషన్‌లో నన్ను కింద పడేసి కొట్టారు. కోటాగాడు వచ్చాడురా అంటూనే మీదపడి దాడిచేసి కొట్టారు. కానీ తర్వాత ఎన్టీఆర్‌ని స్వయంగా కలిసినప్పుడు ‘మీరు మంచి కళాకారులని విన్నాను బ్రదర్‌. గాడ్‌ బ్లెస్‌ యూ. ఆరోగ్యం జాగ్రత్త. బీ కేర్‌ ఫుల్‌’ అంటూ భుజం తట్టి... వెళ్లిరండి అన్నారాయన. ఠక్కున ఆయన పాదాలకు దండం పెట్టి వచ్చేశాను.


(కోటా శ్రీనివాసరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/Q5SgXR

https://goo.gl/Vp24aB

 

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top