పతనం అంచుకు అమెరికా

పతనం అంచుకు అమెరికా


రెండో మాట

అమెరికా ఘనకీర్తి లేదా గుర్తింపు అంటే; జార్జి వాషింగ్టన్, థామస్‌ జఫర్సన్, అబ్రహాం లింకన్, ఫ్రాంక్లిన్‌ డిలానో రూజ్వెల్ట్, బరాక్‌ ఒబామా వంటి ముందుచూపున్న ఉద్దండులైన రిపబ్లికన్‌ నిర్మాతల కాలం నాటి పాత పుణ్యం. ఇదొక పార్శ్వం. ఈ పార్శ్వం స్వేచ్ఛా సమాజానికి ఆదర్శప్రాయం. మరో పార్శ్వం ఉంది. అది పరపీడనకు, సామ్రాజ్య విస్తరణ కాంక్షకు, యుద్ధాలకు, పెట్టుబడిదారి దోపిడీ సంప్రదాయాలకు నారుపోసి నీరు పెట్టి పోషించినది. నేటికీ కొనసాగుతున్న చరిత్ర. ‘చారడేసి కళ్ల’యినా శవం వల్ల లాభం ఏమిటి?‘వర్తమాన ప్రపంచ రాజకీయాలు విషపూరితమైన తరుణంలో అమెరికా రేపు దారిద్య్రం వైపు ప్రయాణించబోతున్నది. ఆ మోతాదులోనే దాని క్రోధం కూడా పెరిగిపోతుంది. ఈ పరిణామంతో అమెరికా 50వ అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజా వ్యతిరేకత, శత్రుత్వం అనే విష చక్రబంధంలో ఇరుక్కు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దేశానికి అధ్యక్షునిగా ఎన్నిక కాబోతూ ట్రంప్‌ తనకు తానై సృష్టించుకున్న నిగూఢమైన చీకటి వలయం నుంచి తక్షణం బయటపడడానికి ఇంకా సమయం మించిపోలేదు. తన దేశ ప్రయోజనాల కోసం, ప్రపంచ ప్రజల క్షేమం కోసం ఆయన తక్షణమే ఒక ధర్మాన్ని ఆశ్రయిం చక తప్పదు. తనకు ముందు అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన దేశాధినేతలు పాటించి ప్రతిష్టించిన దేశభక్తినీ, సన్మార్గంలో నడిపించగల బోధనలనూ ట్రంప్‌ ఆచరించడం శ్రేయస్కరం.’ – ది ఎకనమిస్ట్‌ (అంతర్జాతీయ మీడియా) హెచ్చరిక, 19–11–2016కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల సభలలోను, తరువాత కూడా నిప్పులు తొక్కుతూ అసంఖ్యాకంగా వివాదాస్పద ప్రకటనలు చేశారు. ‘జాతీయత’కూ, వర్ణ వివ క్షతో కూడిన జాతీయతకు మధ్య తేడా తెలియని మౌఢ్యం ట్రంప్‌ మాటలలో గూడు కట్టుకుని ఉంది.అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ

సంపన్న, వ్యాపార వర్గాలకూ; బానిసత్వంలో మగ్గిపోతున్న నల్లజాతి వారికి మధ్య తలెత్తిన మహా అంతర్యుద్ధాన్ని అబ్రహాం లింకన్‌ (1809–1865) ఎదుర్కొనవలసి వచ్చింది. వర్ణ వివక్షను వ్యతిరేకించే వర్గం వైపు నిలిచి, అమెరికా అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్న మహనీయుడు లింకన్‌. అణగారిపో తున్న వర్గం కోసం విమోచన పోరాటాన్ని నడిపిన లింకన్‌ నాటి అమెరికా ఎక్కడ? జాతి వివక్షే రాజ్యధర్మమన్నట్టు బాహాటంగా చెబుతున్న ఈ 50వ అ«ధ్యక్షుడి నేతృత్వంలోని అమెరికా ఎక్కడ? ఇది గమనించిన మీదటే ‘ది ఎకనమిస్ట్‌’ సరైన సమయంలో అలాంటి హెచ్చరిక చేయవలసి వచ్చింది. చిత్రమేమిటంటే– ఆ హెచ్చరిక మధ్యనే మన ప్రధాని మోదీ ప్రస్తావన కూడా ఉంది. మోదీకి ట్రంప్‌తో ఉన్న ఒక పోలికను పేర్కొనడం విశేషం: ‘దేశాభి మానం పేరుతో జాతి వివక్షను, అసహిష్ణతను బోధించే హిందూత్వ గుంపు లతో మోదీకి సంబంధాలు ఉన్నాయ’ని ‘ది ఎకనమిస్ట్‌’ వ్యాఖ్యానించింది.నేషనల్‌ సోషలిజం ముసుగులో పార్టీని స్థాపించి (నాజీ) మినహాయింపులు లేని సంపూర్ణ ఉపాధి కల్పన ద్వారా నిరుద్యోగాన్ని చుప్తాగా నిర్మూలిస్తానని జర్మనీ యువతకు హామీలు ఇచ్చి గద్దెనెక్కినవాడు అడాల్ఫ్‌ హిట్లర్‌. తీరా జరి గిందేమిటి? నిరుద్యోగ యువతను సైన్యంలో చేర్చడం. ఇంకా, యూరప్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి నెట్టి ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల ఉనికికి ముప్పు తీసుకురావడం కూడా. ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైద్ధాంతిక వాద నలు, ప్రభుత్వ ప్రకటనలు, మంత్రి వర్గంలో తలపెడుతున్న మార్పులు ఈ ధోరణికి అనుగుణంగానే ఉన్నాయి. ఏడు దేశాల ముస్లిం ప్రవాసులను అమె రికా నుంచి బహిష్కరించాలనీ లేదా గెంటివేయాలనీ ట్రంప్‌ తీర్మానించడం, ఇండియా నుంచి ఉన్నత ఉద్యోగాల కోసమో లేదా ఐటీ పేరుతో అమెరికాలో ప్రవేశించిన మన విద్యార్థులకు అకస్మాత్తుగా హెచ్‌–1బి వీసాలను నియం త్రించడం, రద్దు చేయాలని తలపెట్టడం–ఏదైనా ఆయా సందర్భాలలో ట్రంప్‌ ఉపయోగిస్తున్న ట్రంప్‌ కార్డులే. ఇదంతా చేస్తూ ఇంతవరకు ఆ అగ్ర రాజ్యం గొప్పది కాదని ఎవరో భావిస్తున్నారన్నట్టు, అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టి పూర్వ ప్రతిష్టను తీసుకువస్తానని చాటడం, తన జబ్బలు తానే చరుచుకోవడం ఎందుకు?నాటి ఘనకీర్తి, నేటి అపకీర్తి

అమెరికా ఘనకీర్తి లేదా గుర్తింపు అంటే; జార్జి వాషింగ్టన్, థామస్‌ జఫర్సన్, అబ్రహాం లింకన్, ఫ్రాంక్లిన్‌ డిలానో రూజ్వెల్ట్, బరాక్‌ ఒబామా వంటి ముందు చూపున్న ఉద్దండులైన రిపబ్లికన్‌ నిర్మాతల కాలం నాటి పాత పుణ్యం. ఇదొక పార్శ్వం. ఈ పార్శ్వం స్వేచ్ఛా సమాజానికి ఆదర్శప్రాయం. మరో పార్శ్వం ఉంది. అది పరపీడనకు, సామ్రాజ్య విస్తరణ కాంక్షకు, యుద్ధాలకు, పెట్టుబడిదారి దోపిడీ సంప్రదాయాలకు నారుపోసి నీరు పెట్టి పోషించినది. నేటికీ కొనసాగుతున్న చరిత్ర. ‘చారడేసి కళ్ల’యినా శవం వల్ల లాభం ఏమిటి? ఒకనాటి అమెరికా ఘన చరిత్ర... ప్రాథమిక హక్కులకూ, పౌర స్వేచ్ఛా సమాజానికీ అంకితమైన దాని విశిష్ట రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తి ఈనాటి అమెరికా పాలకులలో కానరాదు. ఇది ప్రపంచ దేశాలను కబళించగోరుతూ‡ 90 దేశాలలో సైనిక స్థావరాలను, యుద్ధ విమానాలను, అణ్వాయుధ కేంద్రాలను నెలకొల్పి సరికొత్త బానిస వ్యవస్థకు అండగా నిలిచిన వ్యవస్థ. నీగ్రోల స్వాతంత్య్ర పిపాసకు ఊపిరినిచ్చి, వారి తరఫున వాషింగ్టన్‌ (డీసీ)కు చరిత్రాత్మక యాత్ర (1963) నిర్వహించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ చేసిన ప్రసంగం ఉత్తేజకరంగా భాసిల్లినది ఈ అమెరికాలోనే.లూథర్‌ కింగ్‌ ఇలా అన్నారు: ‘నాకు నలుగురు పిల్లలు. వీరి గురించి నాకొక కల ఉంది. ఒకానొక రోజున ఈ పిల్లల్ని వారి రంగును (నలుపు) బట్టిగాక, వారి గుణాన్నిబట్టి, వారి యోగ్యతను బట్టి మాత్రమే న్యాయ నిర్ణయం చేయగల దేశంలో నివసించగల మంచిరోజు రావాలన్నదే ఆ కల, ఎదు రుచూస్తున్న కల!’ కానీ, ఆ కల, అలాంటి కలలూ కరిగిపోతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల పదవీ విరమణ చేసిన  ఒబామా పేద, మధ్యతరగతి వర్గాల కోసం రూపొందించిన వైద్య ఆరోగ్య పథకాన్ని (ఒబామా కేర్‌) నీరు కార్చడానికి ట్రంప్‌ కంకణం కట్టుకున్నారు. తన నిర్ణయం మంచి–చెడుల గురించి ప్రశ్నించే పత్రికల వాళ్లను ‘‘దేశం విడిచి’’ పొమ్మంటున్నాడు. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ప్రాసాదానికీS (వైట్‌హౌస్‌), ఉపా ధ్యక్షుడికీ, సెనెట్‌కూ, ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)కూ మధ్య అధికారాల, విధుల పంపిణీలో ఎవరి పాత్ర, ఎవరి బాధ్యత ఏమిటో తెలియకుండా పోయిందని మీడియా ఎత్తిచూపవలసి వచ్చింది. ఈ దృశ్యం మన దేశంలో పెద్ద నోట్ల రద్దును గుర్తు చేస్తుంది. ఈ అంశంలో పార్లమెం టును పూర్తిగా విస్మరించడమే గాకుండా, కనీసం దేశ ఆర్థిక, కరెన్సీ కార్యకలాపాల్ని నిర్వహించే రిజర్వు బ్యాంకుకు, క్యాబినెట్‌కూ కూడా సంబంధం లేని సన్నివేశంతో మాత్రమే ఆ దృశ్యం (నోట్ల రద్దు) తులతూగుతోందని ‘ది ఎకానమిస్ట్‌’ రాస్తోంది. ఒబామా కేర్‌తో పేద, ఉద్యోగ వర్గాలకు ఒనగూడవలసిన ‘బీమా సౌక ర్యాన్ని’ దక్కకుండా చేయడమే ట్రంప్‌ ఆశయం.నాణేనికి బొమ్మా బొరుసులే

ఎక్కువ సందర్భాల్లో అమెరికన్‌ డెమోక్రటిక్‌ పార్టీకీ, రిపబ్లికన్‌ పార్టీకీ మధ్య విధానాలలో పెద్ద తేడాలుండవు. ఈ రెండు పార్టీలూ ఆచరణలో సంపన్న వర్గాలకు మాత్రమే ఊడిగం చేస్తాయనీ, వీరంతా ‘డెమోరిపబ్లికన్స్‌’(అంటే డెమోక్రాటిక్‌ రిపబ్లికన్స్‌) అని అమెరికా జాతీయ కార్మికవర్గ అగ్ర సంస్థ వ్యంగ్యంగా పేర్లు పెట్టింది. కార్మికవర్గ ఉన్నత స్థాయి నేత విలియం విన్‌పిసింజర్‌ ఇలా ప్రకటించారు: ‘అమెరికాలో మేం అనుభవిస్తున్నది ‘కపట /పరిహాస పూర్వకమైన కుహనా ప్రజాస్వామ్యం. మాకున్నది రెండు పార్టీల (ద్విపక్ష) వ్యవస్థ. పేరుకు రెండు పార్టీలే. కానీ ఉన్నది ఒక పార్టీయే! అసలు మూడవ పార్టీ రంగంలోకి  రావటాన్ని దుర్లభం చేశారు. ఆ రెండు పార్టీల్లో ఒకటి కార్పొరేట్‌ రంగ కుబేర వర్గాలది. కాకపోతే దీనికి రెండు గదులుం టాయి. ఒక గదిలో డెమోక్రాటు,్ల రెండవ గదిలో రిపబ్లికన్‌లు ఉన్నారు’. ఎవరైనా మూడో పార్టీని స్థాపించినా, స్థాపించే ప్రయత్నం చేసినా ఆ పార్టీని, దాని నాయకుడిని కూడా ఏదో ఒక స్కాండల్‌ మోపి, రంగం నుంచి తప్పించే ఏర్పాట్లు ఉన్నాయి. జస్సీ జాక్సన్‌ను ప్రెసిడెన్షియల్‌ ఎన్నికలలో పోటీ నుంచి బలవంతాన తప్పించడం ప్రపంచానికి తెలుసు.అమెరికా అధ్యక్ష ఎన్నికల పట్ల ఎలాంటి ఆసక్తి చూపడానికి కూడా కారల్‌ మార్క్స్‌ ఇష్టపడేవారు కాదు. కానీ లింకన్‌ రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికైన రోజున, మార్క్స్‌ అధ్యక్షతన సమావేశమైన అంతర్జాతీయ కార్మిక సమాఖ్య జనరల్‌ కౌన్సిల్‌ అభినందిస్తూ  తీర్మానం చేసింది. అదొక చారిత్రక పత్రం. ‘ఏకాగ్ర దీక్షతో బానిసల విమోచనం కోసం కృషి చేసిన కార్మిక వర్గ ముద్దుబిడ్డ అబ్రహాం లింకన్‌’ అని అందులో అభివర్ణించారు. ఈ అభినందన  సందేశాన్ని లండన్‌లోని అమెరికా రాయబారి ఫ్రాన్సిస్‌ ఆడమ్స్‌ ద్వారా లింక న్‌కు అందజేశాడు మార్క్స్‌. ఆపై ఆరు నెలలు గడవకముందే లింకన్‌ మహాశ యుడ్ని బానిసల విమోచన ప్రకటనను వ్యతిరేకించే శ్వేతజాతీయులు పొట్టన బెట్టుకున్నారు. ఆ హత్యపట్ల క్రోధాన్నీ, మృతికి విచారాన్నీ ప్రకటిస్తూ మార్క్స్‌ జనరల్‌ కౌన్సిల్‌ ద్వారా తీర్మానం చేయించి పంపారు కూడా. ‘నక్ష త్రాల తళతళల మధ్య స్వాతంత్య్ర చిహ్న మైన (స్టార్‌ స్పాంగిల్డ్‌ బ్యానర్‌) అమెరికా పతాకం తన కార్మికవర్గ భవిత వ్యానికి పూచీపడి తన వెంటగొని పోయింద’ని మార్క్స్‌ ఆర్ద్రతతో ప్రకటించాడు.ఇద్దరూ రిపబ్లికన్లే....

హత్యకు ముందు లింకన్‌ అమెరికా వర్గ వ్యవస్థ లక్షణాల్ని ఏకరవు పెడుతూ, కార్మిక వర్గానికి రానున్న ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ చేసిన హెచ్చరికను మర చిపోరాదు: ‘ప్రస్తుతం సంపన్న వర్గ వ్యవస్థపైన జరుగుతున్న తిరుగు బాటు సందర్భంగా కార్మిక వర్గం ఒక విషయాన్ని గుర్తించాలి. కార్మిక వర్గంలోనే అసూయాద్వేషాలు, విభజన పోకడలు, శత్రుత్వాలు బహిర్గతం అవుతున్నం దున అలాంటి అవలక్షణాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సంబంధాలకు వెలుపల నెలకొనే మానవ ఔదార్యం, సహానుభూతి బలమైన బంధంగా ఉండాలి, అది సకల దేశాల కార్మిక శ్రామిక ప్రజలందరినీ, అన్ని భాషల వారినీ కదంతొక్కేట్టు చేయాలి. ఆస్తి అనేది శ్రమశక్తి అందించినప్పుడు, అది ప్రపంచానికి అంది వచ్చిన క్రియాశీలమైన మేలు’ అన్నాడు లింకన్‌. ఆ సందే శాన్ని ట్రంప్‌లాంటి వాళ్లు అర్థం చేసుకోలేరు. అందుకే ఇప్పుడు కాదు, గత 18 ఏళ్లకుపైగా ఫెడరల్‌ ప్రభుత్వానికి నేను ఆదాయపు పన్నును ఎగవేస్తూ వస్తున్నానని ప్రకటించగలిగాడు. ఇలాంటి ప్రబుద్ధులు మన దేశ పాలకు ల్లోనూ బయటపడుకుండా తప్పించుకు తిరుగుతూ ధన్యులమని అనుకుం టున్నారు. అబ్రహం లింకనూ రిపబ్లికనే, ట్రంపూ రిపబ్లికనే, కానీ నాగలోకా నికీ నక్కకూ ఉన్నంత తేడా.

- ఏబీకే ప్రసాద్‌


సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Back to Top