అపురూపమైన సంప్రదాయ వంగడం ‘మచ్చల కంది’! | Traditional strains of crops | Sakshi
Sakshi News home page

అపురూపమైన సంప్రదాయ వంగడం ‘మచ్చల కంది’!

Jun 23 2015 3:48 AM | Updated on Oct 16 2018 3:25 PM

అపురూపమైన సంప్రదాయ వంగడం ‘మచ్చల కంది’! - Sakshi

అపురూపమైన సంప్రదాయ వంగడం ‘మచ్చల కంది’!

సంప్రదాయ వంగడాలు అపురూపమైనవి. ఈ పంటల దిగుబడులు ఔషధ గుణాలకు చెరగని చిరునామాలు.

సంప్రదాయ వంగడాలు అపురూపమైనవి. ఈ పంటల దిగుబడులు ఔషధ గుణాలకు చెరగని చిరునామాలు. నేలతల్లినే నమ్ముకున్న అన్నదాతలు అడవి మొక్కల్లో నుంచి తమకు అవసరమైన పంట మొక్కల్ని ఏరికోరి తెచ్చి.. వేల ఏళ్ల క్రితం నుంచి పొలాల్లో సాగు చేస్తూ పరిరక్షించుకుంటున్న అమూల్యమైన జాతి సంపద ఈ దేశీ విత్తనాలు. సుసంపన్నమైన చిరకాలపు వ్యవసాయ సంస్కృతికి ఆనవాళ్లయిన ఇటువంటి విశిష్ట వంగడాలపై జన్యుహక్కులను కాపాడుకోవడం అవసరం.
 
 ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జెరి (మోడి) గ్రామ పరిసరాల్లో రైతులు అనాదిగా ‘మచ్చల కందు’లను సాగు చేస్తున్నారు. మచ్చల కంది గింజలు మామూలు కందుల కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. అధిక ప్రొటీన్లు కలిగిఉండటం, రుచిగా ఉండటం, త్వరగా ఉడకటం, కడుపు ఉబ్బరం కలిగించకపోవడం.. వంటివి మచ్చల కందుల విశిష్టతలు.  జెరి గ్రామ జీవవైవిధ్య యాజమాన్య కమిటీ(బీఎంసీ) ఆ ప్రాంతంలోని పంటలు, ఔషధ మొక్కలు, పశువులు, చేపలు, ఇతర జంతుజాలానికి సంబంధించిన వివరాలను ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్‌లో నమోదు చేసింది. తన వారసత్వ సంపదగా ఈ బీఎంసీ గుర్తించిన వంగడాల్లో విశిష్టమైనవి మూడు రకాలు: మచ్చల కంది, బాలింత పెసలు, పెద్దజొన్నలు. వీటిని తమ రైతుల సంప్రదాయ వంగడాలుగా గుర్తించమని కోరుతూ జెరి బీఎంసీ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ద్వారా ఢిల్లీలోని ‘రైతుల హక్కులు, వంగడాల పరిరక్షణ ప్రాథికార సంస్థ’కు గతంలో దరఖాస్తు చేసింది.
 
 ఈ నేపథ్యంలో ‘మచ్చల కందుల’కు ఇటీవల ప్రాధికార సంస్థ గుర్తింపు దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి గుర్తింపు పొందిన తొలి సంప్రదాయక వంగడం ఇదే కావటం విశేషం. ఉడబెట్టుకొని తినడానికి మచ్చల కంది కాయలు చాలా బాగుంటాయని, మార్కెట్‌లో కిలో రూ. 40-50లు పలుకుతున్నాయని జెరి బీఎంసీ సభ్య కార్యదర్శి ఎస్‌కే దస్తగిరి (99893 32675) ‘సాక్షి’తో చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement