హైదరాబాద్ సభకు అనుమతి ఇప్పించండి | YSRCP seeks high court permission for public meeting | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ సభకు అనుమతి ఇప్పించండి

Oct 9 2013 1:44 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఈ నెల 19న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో తాము నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ
అనుమతి విషయంలో పోలీసులు కావాలనే జాప్యం
చేస్తున్నారని వెల్లడి.. వ్యాజ్యం నేడు విచారణకు వచ్చే అవకాశం


 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో తాము నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ సభకు అనుమతినిచ్చే విషయంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీ, శాప్ వైస్ చైర్మన్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎల్.బి.స్టేడియంలో 19వ తేదీన సభ నిర్వహణకు అనుమతినివ్వాలని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీకి ఈ నెల 3న దరఖాస్తు చేసుకున్నామని, సభ నిర్వహణకు శాప్ వైస్ చైర్మన్ అనుమతినిచ్చిన విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లామని శివకుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే డీసీపీ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను కలిసి, సభ నిర్వహణకు అనుమతినిచ్చేలా డీసీపీని ఆదేశించాలని కోరామని, ఇదే విషయంపై డీజీపీని సైతం కలిశామని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు ఎన్ని వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు తమకు అనుమితినిచ్చే విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, ఇది అన్యాయమని వివరించారు.

 19కి ముందు రోజు నిరాకరించే ఆలోచన!
 పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమ దరఖాస్తులపై జాప్యం చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. సభ నిర్వహణ తేదీ అయిన 19వ తేదీకి ఒకరోజు ముందు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసిందని, ఇదే జరిగితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీగా బహిరంగ సభ నిర్వహించుకునే హక్కు తమకుందని శివకుమార్ పేర్కొన్నారు. సభకు అనుమతినిచ్చే విషయంలో జాప్యం చేయడం తమ హక్కులను హరించడమే అవుతుందని వివరించారు. ఎల్.బి.స్టేడియంలో ఇటీవల ఏపీఎన్‌జీవోలు సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారని, గతంలోనూ అనేక సభలు అదే స్టేడియంలో జరిగాయని తెలిపారు. 19న సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటన చేశారని, సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వివరించారు. కాబట్టి తమ సభకు వెంటనే అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement