రైతు ఆత్మహత్యలకు కారణాలు వెతకండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించడాన్ని సీపీఐ, సీపీఎం అనుబంధ రైతు సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి
ఆత్మహత్యల నివారణకు రైతు సంఘాల సూచనలు
సాక్షి, హైదరాబాద్ : రైతు ఆత్మహత్యలకు కారణాలు వెతకండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించడాన్ని సీపీఐ, సీపీఎం అనుబంధ రైతు సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ మేరకు సోమవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ విధానాలే అన్నదాతల బలవన్మరణాలకు కారణమని స్పష్టం చేశాయి. 2014లో ఏపీలో కేవలం 48 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్టు సీఎం చెప్పడాన్ని తప్పుబట్టాయి.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 96 మంది రైతులు చనిపోయిన విషయం తెలియదా? అని ప్రశ్నించాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 17 నెలల కాలంలో 300 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారని పేర్కొన్నాయి. రైతు ఆత్మహత్యల నివారణకు, వ్యవసాయ సంక్షోభ నివారణకు ఆయా సంఘాల నేతలు వి.సుబ్బారావు, రావుల వెంకయ్య, రామచంద్రయ్య తదితరులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.