పద్మ అవార్డుల్లో ఈసారి కొత్త ట్రెండ్!
సాధారణంగా పద్మ అవార్డులు రావాలంటే భారీగా రికమండేషన్లు అవసరం అవుతాయి.
సాధారణంగా పద్మ అవార్డులు రావాలంటే భారీగా రికమండేషన్లు అవసరం అవుతాయి. పెద్ద పెద్ద నాయకుల వద్దకు అప్లికేషన్లు తీసుకెళ్లడం, వాటికి మద్దతుగా సర్టిఫికెట్లు, పేపర్ కటింగులు, సీడీలు.. ఇవన్నీ ఇవ్వడం, దాన్ని పైవరకు పంపేలా వాళ్లను సంతృప్తిపరచడం.. ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నది ప్రచారంలో ఉన్న విషయం. కానీ, అసలు ఎవరూ రికమండ్ చేయకుండా కూడా పద్మ అవార్డులు వచ్చినవాళ్లు ఈసారి ఉన్నారు. వాళ్లలో చాలామంది పేర్లు పెద్దగా ప్రచారంలో ఉన్నవి కూడా కాదు. దేశంలో అందరికీ తెలియకపోవచ్చుగానీ.. వాళ్లున్న ప్రాంతంలో ఆయా రంగాల్లో వాళ్లు నిజంగా లబ్ధప్రతిష్ఠులే. అలాంటి వాళ్ల గురించి ఒక్కసారి చూద్దాం..
మీనాక్షి అమ్మ.. కేరళలోని కలరియపట్టు యుద్ధకళను నేర్పుతున్న అత్యంత పెద్దవయసు మహిళ. ఈమె దాదాపు 68 ఏళ్లుగా ఆ మార్షల్ ఆర్ట్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక దారిపల్లి రామయ్య.. తెలంగాణలో వృక్ష పితామహుడు. ఆయన ఒక్కరే రాష్ట్రంలో కోటికి పైగా మొక్కలు నాటారు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ సుబ్రతోదాస్ జాతీయ రహదారుల మీద అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తుంటారు. ప్రమాదాలకు గురైనవాళ్లకు ఈయన ఆపద్బాంధవుడు. డాక్టర్ దాదీ అనే పేరున్న 91 ఏళ్ల డాక్టర్ భక్తి యాదవ్.. ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె గత 60 సంవత్సరాలుగా పేద మహిళలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఆమెను గుర్తించింది. వీళ్ల పేర్లను ఏ ఒక్కరూ రికమండ్ చేయలేదని, తమ సొంత పరిశోధక బృందం వాళ్ల గురించి సమాచారం తెలుసుకుని, దాన్ని స్థానిక జిల్లా అధికారులతో మరోసారి ఖరారు చేసుకుని అప్పుడు పద్మ కమిటీ పరిశీలనకు పంపిందనం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి తెలిపారు. అప్పుడప్పుడైనా ఇలాంటి నిజాయితీపరులకు, సేవాభావంతో వ్యవహరించేవాళ్లకు గుర్తింపు లభిస్తే పద్మ అవార్డులు సార్థకం అవుతాయి.