శశికళ చుట్టూ బిగిసిన ఉచ్చు | Sakshi
Sakshi News home page

శశికళ చుట్టూ బిగిసిన ఉచ్చు

Published Wed, Jul 26 2017 8:58 AM

శశికళ చుట్టూ బిగిసిన ఉచ్చు

 ►రోజుకో చర్చ
►చిన్నమ్మకు ఇంటి భోజనం
►ఆ మంత్రి ఎవరో ?
►విచారణలోనిగ్గు తేలుతుందన్న పళని


పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. రోజుకో అంశం తెర మీదకు వస్తుండడంతో రాష్ట్రంలో చర్చ ఊపందుకుంది. హోసూరు నుంచి అంబులెన్స్‌లో శశికళకు  అన్ని రకాల వస్తువులు సరఫరా సాగినట్టు మంగళవారం సమాచారం అందింది. అయితే, ఓ మంత్రి ఇంటి  నుంచి అన్నాడీఎంకే నాయకుడి పర్యవేక్షణలో ఈ అంబులెన్స్‌ వెళ్లి ఉండడంతో ఆ మంత్రి, ఆ నాయకుడు ఎవరో అన్న ప్రశ్న మొదలైంది.

చెన్నై :  అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు పరప్పన అగ్రహార చెరలో లగ్జరీ సౌకర్యాల వ్యవహారం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఈ పరిస్థితుల్లో విచారణ తమిళనాడు చుట్టూ తిరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే సమాచారాలు విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటక డీజీపీ మొదలు అందరూ అధికారులకు ఆకాశ రామన్న ఉత్తరం ఒకటి చేరడం, అందులో ఉన్న అంశాలు వెలుగులోకి రావడంతో తమిళనాట చర్చ మరింతగా ఊపందుకుంది. ఇక, చిన్నమ్మ చుట్టూ ఉచ్చు మరింతగా బిగిసినట్టుగా ఆ ఉత్తరం స్పష్టం చేస్తుండటం ఆలోచించ దగ్గ విషయం.

ఆ ఉత్తరం మేరకు నల్ల ధనం కేసులో కర్ణాటకలో పట్టుబడ్డ పలువురు ప్రముఖులు శశికళకు సౌకర్యాల కల్పనలో రాయబారాలు అధికారులతో సాగించినట్టు వివరించి ఉన్నట్టు సమాచారం. అలాగే, పరప్పన అగ్రహార చెరలో పనిచేస్తున్న ఎస్‌ఐ స్థాయి అధికారి ఒకరు కేవలం వీఐపీల సౌకార్యాల కల్పన మీదే పూర్తిస్థాయిలో మునిగి ఉన్నట్టు, ఆ అధికారి శశికళకు అన్ని సౌకర్యాలు సమకూర్చినట్టు ఆకాశ రామన్న ఉత్తరంలో పేర్కొని ఉంది. అలాగే, హోసూరుకు చెందిన ఓ అన్నాడీఎంకే నేత అంబులెన్స్‌లో చిన్నమ్మకు కావాల్సినవన్నీ పరప్పన అగ్రహార చెరకు తరలించినట్టు, ప్రత్యేకంగా వంటకాలు రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరి ఇంటి నుంచి వెళ్లినట్టుగా ఆరోపణలు గుప్పించి ఉండటంతో ఆ ఇద్దరు ఎవరో అన్న చర్చ బయలు దేరింది.

ఇక, డీఐజీ రూపా సైతం రోజుకో వివరాలను బయటపెడుతూ రావడంతో, ఈ ఇతివృత్తంతో సినిమా తీసే అవకాశాలు ఉన్నట్టుగా కర్ణాటక నుంచి సంకేతాలు వస్తుండటంతో అందర్నీ ముక్కుమీద వేలు వేసుకునేలా చేస్తున్నాయి. కాగా, ఇన్నాళ్లు శశికళ విషయంలో నోరు మెదపని సీఎం పళని స్వామి ఢిల్లీ వేదికగా ప్రపథమంగా గళం విప్పడం గమనార్హం. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారోత్సం నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం పళని స్వామి తమిళనాడు భవన్‌లో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శశికళ లగ్జరీ సౌకర్యాల గురించి ప్రశ్నించగా, ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణ సాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణ మేరకు అన్ని విషయాలు నిగ్గు తేలుతాయని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement