సింధు బంగారమే ఎందుకంటే... రాజమౌళి ట్వీట్!

సింధు బంగారమే ఎందుకంటే... రాజమౌళి ట్వీట్! - Sakshi


ఒలింపిక్స్ లో సిల్బర్ మెడల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి ప్రశంసల్లో ముంచెత్తారు. ఫైనల్ లో అద్బుతమైన పోరాటస్ఫూర్తిని కనబర్చిన సింధును చూసి తామంతా గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి గోల్డ్ మెడల్ కంటే గొప్పదని ప్రశంసించారు.



అంతేకాదు 'సింధు- వెండి గెలుచుకున్న బంగారం' అంటూ దర్శకనిర్మాత గుణ్ణ గంగరాజు తన బ్లాగులో రాసుకున్న అభిప్రాయాన్ని రాజమౌళి ట్వీట్ చేశారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్న సింధులోని గొప్ప సంస్కారాన్ని, ఆమెలోని వినయవిధేయతలను వివరిస్తూ గుణ్ణం గంగరాజు ఈ బ్లాగ్ పోస్టు రాశారు. ఆమె ఎందుకు బంగారం వివరిస్తూ.. గుణ్ణం గంగరాజు రాసిన అభిప్రాయం ఇది...

 

సింధు — వెండి గెలుచుకున్న బంగారం
రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా. టీవీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరోపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కరోలినా మారిన్ ని పైకి లేపి హత్తుకుంది. ఇది సహ అనుభూతి; ఇది తనపైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ సింధుని కౌగిలించుకొని ఆ విజయోత్సాహంలో తన కోచ్ ల వద్దకు వెళ్ళిపోయింది. తన రాకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సింధు ఆ రాకెట్ తీసి, మారిన్ కిట్ బ్యాగ్ దగ్గర పెట్టి అప్పుడు తన గురువు దగ్గరకు వెళ్ళింది. ఇది సంస్కారం. ఇదీ బంగారం. తల్లితండ్రుల పెంపకం, గురువుల శిక్షణతో వచ్చేది; గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, ఏ రాష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది ప్రపంచంలో. అది మలిచిన రమణ విజయలక్ష్మిలకు, గురువు గోపిచంద్ కు నమస్కరిద్దాం.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top