
కాల్పుల విరమణకు పాక్ తూట్లు
పాకిస్థానీ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెగబడ్డాయి.
జమ్మూ: పాకిస్థానీ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్దనున్న 10 ఔట్‌పోస్టులపై తూటాల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు, ఒక ఎస్పీవో గాయపడ్డారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని ఆర్‌ఎస్ పురా, రామ్‌గఢ్, కనాఛక్, ఆర్నియా, చెకినెక్ ప్రాంతాల్లోని ఔట్‌పోస్టులపై ఆదివారం రాత్రంతా మోర్టార్లతో గుళ్ల వర్షం కురిపించారని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో సరిహద్దుల్లోని కుగ్రామాలపై కూడా కాల్పులు జరపడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారని చెప్పారు.
దీంతో సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారని, సోమవారం ఉదయం వరకు పరస్పర కాల్పులు కొనసాగాయని వెల్లడించారు. ఆగస్టు 14 నుంచి పాక్ బలగాలు సరిహద్దుల వద్ద నిరంతరం కాల్పులు సాగిస్తున్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు 140 సార్లు పాక్ బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలిపారు. కాగా, సరిహద్దుల వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళవారం కాశ్మీర్ రానున్నారు. బీఎస్‌ఎఫ్ ఔట్‌పోస్టులను ఆయన పరిశీలించనున్నట్లు తొలుత షెడ్యూల్ ఖరారైనా, ఆయన ఔట్‌పోస్టుల వద్దకు రారని హోంశాఖ తెలిపింది. భారత ఔట్‌పోస్టులపై పాక్ నిరంతరం కాల్పులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయనను అక్కడకు దూరంగానే ఉంచనున్నుట్లు సమాచారం.
ప్రతిస్పందించక తప్పదు: ఒమర్ హెచ్చరిక
కాల్పుల విరమణ ఉల్లంఘనను ఇలాగే కొనసాగిస్తే భారత్ దీటుగా ప్రతిస్పందించక తప్పదని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ ఇదే ధోరణిని కొనసాగిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించాల్సి వస్తుందన్నారు. గతనెలలో భారత ప్రధాని మన్మోహన్, పాక్ ప్రధాని నవాజ్ న్యూయార్క్‌లో జరిపిన చర్చల దరిమిలా పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉభయ దేశాల డీజీఎంవోలు భేటీ కావాల్సి ఉందని, ఆ సమావేశం ఇంకా జరగలేదని ప్రశ్నించారు. పాక్ బలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనను కొనసాగిస్తుంటే, భారత్ చేతలతో ప్రతిస్పందించాల్సి వస్తుందన్నారు. కాగా, భారత బలగాలు సియాల్ కోట్ సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో తమ పౌరులు ఇద్దరు మరణించారని పాక్ ఆరోపించింది.