హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’ | ollow the mahatma campaign will be conducted in netherlands | Sakshi
Sakshi News home page

హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’

Sep 20 2017 7:21 PM | Updated on Sep 21 2017 1:39 PM

గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, ఇక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించాయి.

దిహేగ్‌(నెదర్లాండ్స్‌): గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, ఇక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించాయి. అక్టోబర్‌ 1, 2 తేదీల్లో హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఇందులో అహింసా సిద్ధాంతాన్ని బలపరిచే వివిధ సంస్థలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ ఒకటిన హేగ్‌ నగరంలోని పీస్‌ ప్యాలెస్‌ నుంచి గ్రోట్‌కెర్క్‌ వరకు ‘గాంధీ మార్చ్‌’ చేపట్టనున్నారు. ఇందులో భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 1,500 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో ఇటువంటి ర్యాలీ నిర్వహించటం ఇదే ప్రథమమని అంటున్నారు.

ఈ సందర్భంగా గాంధీజీ వాడిన సైకిల్‌ను గ్రోటె కెర్క్‌ వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సైకిల్‌ను భారత ప్రభుత్వం పంపించింది. నెదర్లాండ్స్‌ వాసులకు సైక్లింగ్‌ చాలా ఇష్టం. ఇక్కడి సంస్కృతిలో సైకిల్‌ ఒక భాగం కావటం గమనార్హం. అదేవిధంగా గ్రోటెకెర్క్‌ వద్ద ఉన్న కోర్జో థియేటర్‌లో సత్యాగ్రహ పేరుతో ప్రముఖ సంగీత కళాకారుడు ఫిలిప్‌ గ్లాస్‌ నేతృత్వంలో ఒపెరా ఉంటుంది. డచ్‌ భాషలో ప్రమోద్‌ కుమార్‌ అనే భారతీయుడు రచించిన ‘గాంధీ- యాన్‌ ఇల్యుస్ట్రేటెడ్‌ బయోగ్రఫీ’  అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. 

అదేవిధంగా అక్టోబర్‌ 2వ తేదీన స్వచ్ఛంద కార్యకర్తలు నెదర్లాండ్స్‌లోని పాఠశాలలకు వెళ్లి గాంధీజీ బోధించిన అహింస, శాంతి, సహనం ప్రాధాన్యతను వివరించనున్నారు. నెదర్లాండ్స్‌ వాసులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్‌ 2వ తేదీన చేపట్టే కార్యక్రమాలపై ఫేస్‌బుక్‌లో ఒక పేజీ క్రియేట్‌ చేశామన్నారు. ఆయా కార్యక్రమాలను టాటా స్టీల్‌ (యూరప్‌) చైర్మన్‌ థియే హెన్రార్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీలో ప్రొఫెసర్‌ వినోద్‌ సుబ్రమణ్యం‌, వీయూ వర్సిటీ ఆమ్‌స్టర్‌డామ్‌ రెక్టార్‌ మాగ్నిఫికస్‌, మాజీ ఎంపీలు ఆర్‌.రాంలాల్‌, తాంజా జద్‌నాన్‌సింగ్‌ ఉన్నారు.
 
నెదర్లాండ్స్‌ దేశస్తులు మహాత్మునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే.. అక్కడి పట్టణాల్లోని దాదాపు 30 వీధులకు మహాత్మాగాంధీ పేరు పెట్టుకున్నారు. ఇండియా తర్వాత అత్యధికంగా మహాత్ముని పేరు పెట్టుకున్న దేశం నెదర్లాండ్స్‌ కావటం విశేషం. అంతేకాదు నెదర్లాండ్స్‌లోని దిహేగ్‌, ఆమ్‌స్టర్‌డామ్‌, ఉట్రెచ్‌ నగరాల్లో మహాత్ముని విగ్రహాలు నెలకొల్పారు. గాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినంగా ప్రకటించి, అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement