అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎమ్మెల్యేలను ఆర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత భారీ ఎత్తున పోలీసులు, మార్షల్స్ అసెంబ్లీ హాలుకు చేరుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మీడియాను అనుమతించకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అరెస్ట్ కు రంగం సిద్దం చేసిన పోలీసులు మీడియా కంటపడకుండా ఎమ్మెల్యేలను వాహనాల్లో తరలించారు.
అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేల అరెస్ట్ కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనాల్లో పార్టీ కార్యాలయాలకు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లోటస్ పాండ్ లోని కార్యాలయానికి తరలించగా, టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్డీఆర్ టీడీపీ కార్యాలయంలో వదిలిపెట్టారు.
అయితే తమను బలవంతంగా అరెస్ట్ చేసినా.. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం తుదివరకు పోరాటం చేస్తామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్సష్టం చేశారు.
అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కొత్తగా ఆంక్షలు విధించారు. మీడియాతో మాట్లాడే ఎమ్మెల్యేలకు, జర్నలిస్టులకు మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన నిబంధనలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.