
వార్నీ..చివరికి అరటి పళ్ళలో కూడానా
సౌదీ కరెన్సీని అరటిపళ్ల ద్వారా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.
కేరళ: అక్రమ రవాణాలో అక్రమార్కులు ఆరి తేరిపోతున్నారు. తాజాగా అరటిపండ్లలో కరెన్సీని తరలిస్తుండగా ఇంటిలిజెన్స్ అధికారులకు చిక్కారు. సౌదీ కరెన్సీని అరటిపళ్ల ద్వారా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో మంగళవారం వీరిని అరెస్టు చేశారు. అరటిపళ్లలోని గుజ్జును తొలగించి దాచిపెట్టిన సుమారు రూ. 46 లక్షల విలువైన సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
కోజికోడ్ విమానాశ్రయం నుంచి దుబాయ్ కు వెళుతున్న ఇద్దరు ప్రయాణికులు తమ లగేజీలో అరటిపండ్ల మధ్య ఈ కరెన్సీ దాచి ఉంచారు. అయితే, అధికారుల తనిఖీల్లో ఈ గట్టు కాస్త రట్టయింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో రూ. 45.69 లక్షల విలువైన సౌదీ రియాలు పట్టుబడ్డాయి.