కాకినాడ ఎంపీ డెబిట్ కార్డు క్లోనింగ్!

కాకినాడ ఎంపీ డెబిట్ కార్డు క్లోనింగ్! - Sakshi


 రూ.50 వేలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లుసాక్షి, సిటీబ్యూరో : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి తోట నర్సింహులు సైబర్ నేరం బారిన పడ్డారు. ఆయన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు గోవాలో రూ.50 వేల నగదు డ్రా చేశారు. దీనిపై ఆయన ఏపీ సీఐడీ అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు... దీన్ని ఓ కొలిక్కి తేవడానికి మార్గం దొరక్క తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని నాంపల్లిలోని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.  దాదాపు 15 రోజుల కిందట తన ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసినట్లు నర్సింహులు సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వచ్చింది. రూ.13 లక్షల వరకు ఉన్న తన ఖాతా నుంచి తనకు తెలియకుండా నగదు డ్రా అవడంతో అప్రమత్తమైన ఆయన బ్యాంక్‌కు సమాచారమిచ్చి లావాదేవీలు నిలిపివేయించారు.ఎస్సెమ్మెస్‌లోని వివరాల ప్రకారం రూ.50 వేలు గోవాలోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి డ్రా అయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం కేసు నమోదైంది. విషయాన్ని అత్యంత గోప్యం గా ఉంచిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం ఆయన డెబిట్ కార్డు క్లోన్ అయినట్లు అనుమానిస్తున్నారు. గోవా ఏటీఎం నుంచి నగదు డ్రా కావడానికి కొన్ని రోజుల ముందు నర్సింహులు బెంగళూరులో షాపింగ్ చేసి తన డెబిట్‌కార్డు ద్వారా చెల్లింపులు జరిపారు.ఆ సమయంలోనే సైబర్ నేరగాళ్లు చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్ల సహాయంతో ఎంపీ డెబిట్ కార్డును క్లోన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్డును ఒకసారి స్వైప్ చేస్తే చాలు... దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని స్కిమ్మర్ సంగ్రహిస్తుంది. నర్సింహులు విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడానికి కచ్చితంగా కార్డుతో పాటు పిన్ నంబరూ ఉండాలి. నర్సింహులు పిన్ నంబర్ నేరగాళ్లకు ఎలా చేరిందనేది అంతు చిక్కట్లేదు. ఇందులో బెంగళూరు దుకాణానికి చెందిన వారి పాత్ర, లేదా బ్యాంకు ఆన్‌లైన్ ఖాతా వివరాలను హ్యాక్ చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సదరు ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాలేమైనా ఉంటే వాటి ఫుటేజీ సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top