 
															నన్ను వేధిస్తున్నారు: జయ మేనకోడలు
													 
										
					
					
					
																							
											
						 జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కు వేధింపులు ప్రారంభమయ్యాయట.
						 
										
					
					
																
	చెన్నై : జయలలిత వారసురాలిగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కు వేధింపులు ప్రారంభమయ్యాయట. ఏప్రిల్ 12 న జరుగబోయే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదని వేధిస్తున్నారని దీపా జయకుమార్ సోమవారం ఆరోపించారు. ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని తాను ప్రకటించినప్పటి నుంచి వివిధ రకాలుగా తనను పరోక్షంగా వేధిస్తున్నారని చెప్పారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండటం లేదని, తనకు వ్యతిరేకంగా పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరి వర్గానికి చెందిన వారో కూడా తెలియడం లేదన్నారు. ఈ ఉప  ఎన్నికల నుంచి తనని విరమింపజేయడానికి పలు కుట్రలు జరుగుతున్నట్టు చెప్పారు.
	 
	ఫిబ్రవరి 24నే  ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనే కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పుతున్నట్టు దీపా జయకుమార్ ప్రకటించారు. ఈ ఫోరం ప్రారంభించడానికి ముందు కూడా చాలా మంది తనకు అడ్డంకులు సృష్టించారని దీపా జయకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ నుంచి దీపా జయకుమార్ పోటీ చేసి అమ్మ అసలు వారసురాలిగా నిరూపించుకోవాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జయలలిత మరణించడంతో ఆమె స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి దీపా పోటీచేస్తున్నారు. ఆర్కే నగర్ వాసులు కూడా చిన్నమ్మను పక్కన పెట్టి, దీపా జయకుమార్ కే తమ మద్దతు తెలుపుతున్నారు.  
 
					
					
					
						