హిల్లరీ సంచలన ఆరోపణలు | Sakshi
Sakshi News home page

హిల్లరీ సంచలన ఆరోపణలు

Published Fri, Jun 2 2017 8:57 AM

హిల్లరీ సంచలన ఆరోపణలు - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి హిల్లరీ క్లింటన్‌ పరాజయ కారణాలపై సవివరంగా స్పందించారు. తన ఓటమికి రష్యా జోక్యం, సొంత పార్టీ, ఎఫ్‌బీఐ, మీడియాతో పాటు ఇతర అంశాలు కారణమయ్యాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి తానే బాధ్యురాలినని, వాటివల్ల మాత్రం ఓడిపోలేదన్నారు.

ట్రంప్‌ అనుయాయుల సహకారంతో తప్పుడు ప్రచారంలో ఆరితేరిన రష్యా వల్లే పరాజయం పాలైనట్లు ఆమె చెప్పారు. పోలింగ్‌ వివరాలు, ఇతర సమాచారం రష్యాకు చేరవేడయంలో ట్రంప్‌ అనుచరులు సాయపడ్డారని ఆరోపించారు. ట్రంప్‌ ప్రచార బృందం, సహచరులకు ఎన్నికల ముందు, అనంతరం రష్యాతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయని.. అన్నీ బహిర్గతమైతే సహకరించిన వారి వివరాలు బయటకొస్తాయన్నారు. ఈ–మెయిల్‌ వివాదాన్ని పెద్ద తప్పుగా పేర్కొంటూ మీడియా అనవసర రాద్దాంతం చేసిందని హిల్లరీ విమర్శించారు.

అయితే హిల్లరీ ఆరోపణలను అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. మోసకారి అయిన హిల్లరీ తన ఓటమికి ప్రతిఒక్కరిని నిందిస్తున్నారని, తాను భయంకరమైన అభ్యర్థినని మాత్రం చెప్పడం లేదని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఫేస్‌బుక్‌, మీడియాను కూడా ఆడిపోసుకుంటున్నారని పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని కల్పించి డొమొక్రాటిక్‌ పార్టీ ఓటమికి సాకులు చెబుతోందని మండిపడ్డారు. డొమొక్రాటిక్‌ పార్టీ చెప్పిన సాకు చూసి రష్యా కచ్చితంగా నవ్వుకుని ఉండొచ్చని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement