ఉల్లి ఎగుమతులపై నిషేధం! | Govt may ban onion export after price rises to Rs 90/kg | Sakshi
Sakshi News home page

ఉల్లి ఎగుమతులపై నిషేధం!

Oct 23 2013 4:09 AM | Updated on Sep 1 2017 11:52 PM

చుక్కలను తాకుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు.. భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

 న్యూఢిల్లీ: చుక్కలను తాకుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు.. భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాంతోపాటు విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించే అంశాన్నీ పరిశీలిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు కిలో రూ.90 వరకు పెరిగిన నేపథ్యంలో మంగళవారం కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడారు. ఉల్లి ధరల పెరుగుదలకు అక్రమ నిల్వదారులే కారణమన్నారు. దేశంలో సరిపోయినంత స్థాయిలో ఉల్లి అందుబాటులో ఉందని, కానీ అక్రమ నిల్వల వల్లే కృత్రిమంగా ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆనంద్‌శర్మ కోరారు. ధరలను నియంత్రించేందుకు ఉల్లి దిగుమతుల కోసం వచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
 
  డిసెంబర్ చివరినాటికి కొత్త ఉల్లి దిగుబడి వస్తుందని, దాంతో ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. కాగా.. ధరలను నియంత్రించేందుకు ఉల్లి ఎగుమతి ధరను కేంద్రం ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. కానీ, దానివల్ల ప్రయోజనం కనిపించడం లేదని, అందువల్ల ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించే యోచన ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే, అకాల వర్షాల కారణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ ఉల్లిపంట దెబ్బతిన్నదని, అదే ధరల పెరుగుదలకు కారణమని ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్ డెరైక్టర్ ఆర్పీ గుప్తా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement