
డిమాండ్ బంగారమే!
భారత్ బంగారం వినియోగం 2013 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 310 టన్నులు. గడచిన పదేళ్ల కాలంలో ఒక క్వార్టర్‌లో ఎప్పుడూ భారత్‌లో ఇంతస్థాయిలో బంగారం వినియోగం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది.
న్యూఢిల్లీ: భారత్ బంగారం వినియోగం 2013 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 310 టన్నులు. గడచిన పదేళ్ల కాలంలో ఒక క్వార్టర్‌లో ఎప్పుడూ భారత్‌లో ఇంతస్థాయిలో బంగారం వినియోగం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. బంగారం దిగుమతులను నియంత్రించి తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్) తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐలు పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. ఏప్రిల్‌లో ధరలు భారీగా పడ్డాన్ని ప్రజలు కొనుగోళ్లకు అవకాశంగా భావించడం, దీనితోపాటు పెళ్లిళ్ల సీజన్ వంటి కారణాలు ఈ క్వార్టర్‌లో పసిడి వినియోగం పెరగడానికి ప్రధాన కారణం.
2012 ఇదే క్వార్టర్‌లో బంగారం కొనుగోళ్లు 181.1 టన్నులు. అంటే 2013 ఇదే క్వార్టర్‌లో దాదాపు 71 శాతం వినియోగ డిమాండ్ పెరిగిందని డబ్ల్యూజీసీ తాజా నివేదిక తెలిపింది. గడచిన పదేళ్ల కాలంలో బంగారం డిమాండ్‌లో రెండవ క్వార్టర్ రికార్డును నమోదు చేసినట్లు డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. దిగుమతులు 338 టన్నులు...: రెండవ క్వార్టర్‌లో దిగుమతులు రెట్టింపై 338 టన్నులుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ఆభరణాలకు సంబంధించి డిమాండ్ 50% పెరిగి 188 టన్నులుగా నమోదయ్యింది. 2012 ఇదే క్వార్టర్‌లో ఈ పరిమాణం 124 టన్నులు. కడ్డీలు, నాణేల వినియోగం 56.5 టన్నుల నుంచి 122 టన్నులకు ఎగసింది.
క్యాడ్ కట్టడికి ఇతర మార్గాలూ ఉన్నాయ్
కాగా క్యాడ్ కట్టడికి బంగారం దిగుమతులపై నియంత్రణలే మార్గం కాదని సోమసుందరం పేర్కొన్నారు. ‘క్యాడ్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇతర మార్గాల ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చని మేము విశ్వసిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. వ్యవస్థాగతంగా, అధికారిక మార్గాల ద్వారా గోల్డ్ లిక్విడిటీని (పసిడి బీరువాలకే పరిమితం కాకుండా, దేశీయంగా సరఫరాలు పెరిగేలా చూడ్డం)మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ, ఇది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని సూచిం చారు. తద్వారా ఆర్థికాభివృద్ధికి బంగారాన్ని సైతం సమర్థవంతంగా వినియోగించుకోడానికి వీలవుతుందని సూచించారు. ఈ దిశలో విధానపరమైన నిర్ణయం ఉండాలని సూచించారు. దేశంలో కోట్లాదిమంది గృహస్తుల వద్ద దాదాపు 20,000 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... దీనిని వారు వ్యూహాత్మక అసెట్‌గా పరిగణిస్తున్నారని అన్నారు.
వర్తమానం, భవిష్యత్‌పై అంచనా...: భారత్ బంగారం డిమాండ్ ప్రస్తుత క్వార్టర్‌లో (జూలై-సెప్టెంబర్) కొంత మందగించే అవకాశం ఉందని సోమసుందరం విశ్లేషించారు. బంగారం దిగుమతుల కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ విధానపరమైన నిర్ణయాలు దీనికి కారణమని తెలిపారు. అయితే పెళ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో నాల్గవ క్వార్టర్‌లో మాత్రం (అక్టోబర్-డిసెంబర్) డిమాండ్ పరిస్థితి సానుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. తగిన వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపించడం కూడా నాల్గవ క్వార్టర్‌లో బంగారం డిమాండ్ పెరగడానికి దోహదపడవచ్చని నివేదిక అభిప్రాయపడింది. మొత్తంమీద 2013 క్యాలెండర్ ఇయర్‌లో బంగారం దిగుమతులు 900 నుంచి 1000 టన్నుల శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది.
భారత్‌ను అధిగమించనున్న చైనా..
ఈ ఏడాది బంగారం డిమాండ్‌లో భారత్‌ను చైనా అధిగమించే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ అంచనావేసింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం తొలి 6 నెలల్లో చైనాలో బంగారం వినియోగం 570 టన్నులని తెలిపింది. భారత్ వినియోగం(566.6 టన్నులు)తో పోల్చితే ఇప్పటికే ఇది కొంత అధికంగా ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా చైనా పసిడికి అనుకూలమైన విధానాన్ని అనుసరించడం దీనికి కారణమని తెలిపింది. బంగారం ధరలు భవిష్యత్తులో స్థిరంగా, కొంత ఎగువముఖ ధోరణిలోనే కొనసాగే అవకాశం ఉందని రెండు దేశాల వినియోగదారులూ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. భారత్ తరహాలోనే చైనాలో కూడా పటిష్ట రిటైల్ వినియోగ ధోరణి ఉండడం వల్ల ఆ దేశంలో కూడా ఈ ఏడాది పసిడి డిమాండ్ 900 నుంచి 1,000 టన్నుల శ్రేణిలో ఉంటుందని డబ్ల్యూజీసీ నివేదిక అంచనా వేస్తున్నట్లు సోమసుందరం తెలిపారు. 2012లో చైనాలో బంగారం వినియోగం 832 టన్నులుకాగా, భారత్‌లో ఈ పరిమాణం 864 టన్నులు.
చైనా తన డిమాండ్ అవసరాల్లో సగం దేశీయ సరఫరాల ద్వారానే నెరవేర్చుకుంటోందని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భారత్ తన పసిడి డిమాండ్‌కు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోందని వివరించారు. ప్రపంచ ఆభరణాల మార్కెట్‌లో 60%పైగా వాటా ఈ రెండు దేశాలదేనన్నారు. కడ్డీలు, నాణేల డిమాండ్ విషయంలో ప్రపంచ మార్కెట్‌లో వాటా దాదాపు 50 శాతమని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి రిటర్న్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ప్రత్యామ్నాయ పొదుపు పథకాలు లేకపోవడంతో ప్రజలు బంగారం కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషించారు.
స్మగ్లింగ్‌పై పటిష్ట నిఘా!
బంగారం దిగుమతుల కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో- పుత్తడి స్మగ్లింగ్ పెరగకుండా కేంద్ర ఆర్థిక నిఘా సంస్థలు, కస్టమ్స్ శాఖలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం- పాసింజర్లు, వాణిజ్య రవాణాలపై నిఘా మరింత పెరగనుంది. ఎయిర్‌పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దుల్లో సంబంధిత అన్ని సంస్థల సిబ్బంది సమన్వయంతో అక్రమరవాణా అప్రమత్త వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) వర్గాలు తెలిపాయి.