ఇంధన పొదుపు చర్యలను ముందుకు తీసుకెళ్ళేందుకు తమ అనుభవాన్ని అందించేందుకు అభివృద్ధి చెందిన
పారిస్ సదస్సు వివరాలు వెల్లడించిన చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఇంధన పొదుపు చర్యలను ముందుకు తీసుకెళ్ళేందుకు తమ అనుభవాన్ని అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు సుముఖత వ్యక్తం చేశాయని రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ ముఖ్య అధికారి ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇంధన పొదుపుపై విశాఖపట్టణంలో మరో ఆరు నెలల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. పారిస్‌లో ఈ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంతర్జాతీయ ఇంధన సదస్సు జరిగింది.
అమెరికాసహా 29 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రం తరపున చంద్రశేఖర్ రెడ్డి సదస్సుకు హాజరయ్యారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌కు వివరించారు. ఇంధన పొదుపు దిశగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై పలు దేశాలు ఆసక్తి కనబరచాయని, ఇదే రీతిలో ముందుకెళ్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. స్టార్ రేటింగ్ విద్యుత్ ఉపకరణాల వాడకం అనుసరణీయమని పలు దేశాల ప్రతినిధులు సూచించినట్టు తెలిపారు.