పీఎఫ్‌పై వడ్డీ 8.75% | EPFO approves raising Provident Fund interest rate to 8.75% | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌పై వడ్డీ 8.75%

Jan 14 2014 2:07 AM | Updated on Sep 5 2018 8:20 PM

పీఎఫ్‌పై వడ్డీ 8.75% - Sakshi

పీఎఫ్‌పై వడ్డీ 8.75%

ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలకు చెల్లించే వడ్డీని స్వల్పంగా పెంచుతూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది.

కేంద్రానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ప్రతిపాదన
ఆర్థికశాఖ ఆమోదం అనంతరం అమలు
మూల వేతనం నుంచి మరో 10% సేకరించి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశంపై పరిశీలన

 
 న్యూఢిల్లీ:
ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలకు చెల్లించే వడ్డీని స్వల్పంగా పెంచుతూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ 8.5 శాతంగా ఉండగా.. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.75 శాతంగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో సీబీటీ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎఫ్‌పై వడ్డీ పెంపు నిర్ణయం దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుందని కార్మికశాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
 ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే పెంపు అమలవుతుందని కేంద్ర భవిష్యనిధి కమిషన్ చైర్మన్ కేకే జలాన్ చెప్పారు. ఈ ఏడాది మొత్తం పీఎఫ్ సొమ్ముపై సుమారు రూ. 25,048 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని.. అందులో 8.75% వడ్డీకి రూ. 25,005 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మిగతా సొమ్ము నిల్వ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తక్కువ ఆదాయం వస్తున్న మార్గాల నుంచి మరింత మెరుగైన పథకాల్లోకి పీఎఫ్ నిధులను మళ్లిస్తామని జలాన్ చెప్పారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్నదానికి అదనంగా మరో 10 శాతం తీసుకుని, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద అందజేసే సొమ్మును 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇక నుంచి బీమా కింద రూ. 1,56,000 ఇస్తారు. దాంతోపాటు ఈపీఎఫ్, ఈడీఎల్‌ఐ పథకాల నిర్వహణ కోసం వసూలు చేసే కనీస చార్జీలను రూ. 500, రూ. 200కు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement