మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం!

మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం! - Sakshi


సావో పాలో/న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణాన్ని మరువకముందే మరో భారీ రక్షణ కుంభకోణం దేశ రాజకీయాల్ని అతలాకుతలం చేసే అవకాశం కనిపిస్తోంది. భారత్‌, సౌదీ అరేబియాతో జెట్‌ విమాన అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రెజిల్‌ కంపెనీ ఎంబ్రెయర్‌ భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌ దర్యాప్తు సంస్థలు, అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నాయి.



2008లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మూడు ఈఎంబీ-145 జెట్‌ విమానాలు కొనుగోలుకు ఎంబ్రెయర్‌తో 208 మిలియన్‌ డాలర్ల (రూ. 1,391 కోట్ల)తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం కోసం దళారీగా వ్యవహరించిన బ్రిటన్‌కు చెందిన డిఫెన్స్‌ ఏజెంటు సంస్థకు భారీగా కమిషన్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భారత రక్షణ వ్యవస్థ ప్రకారం దళారీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేసి ఒప్పందం కుదుర్చుకోవడం నిషేధం.



డీఆర్‌డీవో ప్రాజెక్టు అయిన ఏఈడబ్ల్యూఅండ్ సీ (గగనతల ముందస్తు హెచ్చరికలు, నియంత్రణ వ్యవస్థ) ర్యాడర్‌కు అనుసంధానం చేసేందుకు ఈఎంబీ-145 యుద్ధవిమానాలు కొనుగోలు చేశారు. రూ. 2,520 కోట్లతో డీఆర్‌డీవో ఈ ప్రాజెక్టు చేపట్టగా.. పలు మార్పులతో తయారుచేసిన మొదటి విమానం 2011లో, మిగతా రెండు విమానాలు ఆతర్వాత భారత్‌ చేరాయి. బ్రెజిల్‌ యుద్ధవిమానాల తయారీ సంస్థ ఎంబ్రెయర్‌తో ఒప్పందం విషయంలో అక్రమాలు జరిగిన విషయం డీఆర్‌డీవోకు తెలియదని రక్షణమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top