మరో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య

మరో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య


బెంగళూరు: కర్ణాటకలో మరో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే ఓ వ్యక్తి అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతదేహాన్ని కొడగు జిల్లా బెలగావిలోని ఓ లాడ్జిలో గుర్తించినట్లు పోలీసులు శుక్రవామిక్కడ తెలిపారు. ఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సూసైడ్ నోట్లోని వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.



కాగా తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు.



ఇప్పటివరకూ కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకోవటం వారంలో ఇది రెండోసారి. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షణై  రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ తాజా పరిణామం మరోసారి సిద్దరామయ్య మంత్రివర్గాన్నితలనొప్పిగా మారనుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top