breaking news
deputy superintendent of police MK Ganapathy suicide
-
కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ, జేడీఎస్ ఆందోళన
బెంగళూరు: మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి ఆత్మహత్యపై ప్రతిపక్ష బీజేపీతో పాటు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు తీరును నిరసిస్తూ... 24గంటల నిరసన చేపట్టింది. బీజేపీ, జేడీఎస్ శాసనసభ్యులు రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి ఆందోళన కొనసాగించారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే ... కర్నాటకలో ఐపీఎస్ అధికారులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని నేతలు ఆరోపించారు. మంత్రి కేజే జార్జ్ పేరును బాధితుడు సూసైడ్ నోట్లో ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. మంత్రి రాజీనామా చేయడంతోపాటు... కేసును సీబీఐకి అప్పగించేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పోలీస్ అధికారి గణపతి ఆత్మహత్య కేసులో బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిరాకరించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేజే జార్జ్ మాత్రం బీజేపీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని... సరైన సాక్ష్యాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మరో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలో మరో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే ఓ వ్యక్తి అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ కాలాప్ప హందీబాగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళూరు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంకే గణపతి (51) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతదేహాన్ని కొడగు జిల్లా బెలగావిలోని ఓ లాడ్జిలో గుర్తించినట్లు పోలీసులు శుక్రవామిక్కడ తెలిపారు. ఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సూసైడ్ నోట్లోని వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా తన చావుకు బెంగళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్‌తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమని ఆరోపిస్తూ గణపతి తన సూసైడ్ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కేసుల విషయంలో సీనియర్ అధికారులు తనను వేధించారని, వారి నుంచి ఒత్తిళ్లు తట్టుకోలేకపోయినట్లు ఆయన అంతకు ముందు ఆరోపించారు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఇద్దరు పోలీస్ అధికారులు ఆత్మహత్య చేసుకోవటం వారంలో ఇది రెండోసారి. గతంలోనూ బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా వ్యవహారం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నిజాయితీగా పని చేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ తాజా పరిణామం మరోసారి సిద్దరామయ్య మంత్రివర్గాన్నితలనొప్పిగా మారనుంది.