
కేజ్రీవాల్‌తో అద్వానీ భేటీ రద్దు
బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య శుక్రవారం జరగాల్సిన భేటీ రద్దయింది.
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య శుక్రవారం జరగాల్సిన భేటీ రద్దయింది. దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశముందన్న అద్వానీ మాటలు నిజాలని కేజ్రీవాల్ సమర్థించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్ అద్వానీ అపాయింట్‌మెంట్ కోరారని, అయితే అద్వానీ వేరే పనుల వల్ల భేటీని రద్దు చేసుకున్నారని ఆయన కార్యాలయం తమకు తెలిపిందని సీఎం కార్యాలయం తెలిపింది. బీజేపీ నేత శని, ఆదివారాలు నగరంలో ఉండడం లేదు కనుక భేటీ వచ్చేవారం జరుగుతుందని పేర్కొంది.
ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా డిమాండ్‌పై చర్చించేందుకు సీఎం.. అద్వానీ అపాయింట్‌మెంట్ కోరారు. వీరి భేటీ రద్దు వెనుక బీజేపీ పాత్ర ఉందని ఊహాగానాలు వచ్చాయి. భేటీని రద్దు చేసుకోవాలని బీజేపీ ఒత్తిడి చేసిందా అని విలేకర్లు ఆ పార్టీ నేత సుధాంశు త్రివేదిని అడగ్గా ‘అద్వానీ సీనియర్ నేత. ఎవరిని, ఎప్పుడు కలుసుకుంటారన్నది ఆయనిష్టం’ అని పేర్కొన్నారు.