తెలంగాణ సమస్యను పరిష్కరించమంటే కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో చిచ్చుపెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
సాక్షి,విజయవాడ: తెలంగాణ సమస్యను పరిష్కరించమంటే కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో చిచ్చుపెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూడా వాళ్లు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర పేరుతో కృష్ణా జిల్లాలో ఆఖరురోజు గంపలగూడెం, తిరువూరు మండలాల్లో బాబు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా తిరువూరు, ఎర్రమాడుల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు, సీట్లు కోసం తెలంగాణపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుందన్నారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను కలుపుకొని లాలూచీ రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలుగుజాతి రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలని తెలుగుదేశం కోరితే వాలీ,సుగ్రీవుల లాగా విడదీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ, ఆ అనుబంధాన్ని తెంచేస్తోందని విమర్శించారు.
సీఎం కిరణ్ సోనియా వద్దకు పోయి మీ ఇష్టం వచ్చినట్లు చేయమని చెబుతారని, ఇక్కడకు వచ్చి సన్నాయి నొక్కుళ్లు నొక్కుతారని అన్నారు, ఆయన రేపో ఎల్లుండో సమైక్యాంధ్రప్రదేశ్ అనే పార్టీ పెడతారంటున్నారని విమర్శించారు. ఇండియా దివాళా తీసిందని అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ పేర్కొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలమయమైందని, రూ.5 ల క్షల కోట్లు దోచుకున్నారని, సోనియా అల్లుడూ దోచేసుకున్నారని అన్నారు. కాగా, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బస్సుయాత్రకు కార్యకర్తలు కరువవడంతోపాటు, పశ్చిమగోదావరి జిల్లా నేతల నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం రాత్రితో తూతూ మంత్రంగా ముగించారు. ఈ బస్సుయాత్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎవరైనా నినాదాలు చేస్తే వారిపై పోలీసులు, చంద్రబాబు ప్రైవేటు సైన్యం మూకుమ్మడిగా దాడిచేసి వారి ఒళ్లు హూనం చేయడం గమనార్హం.