'పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు' | chandra babu gets rs 300 crores bribes with pattiseema, alleges ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

'పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు'

Apr 16 2015 10:52 AM | Updated on Jul 25 2018 4:09 PM

'పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు' - Sakshi

'పట్టిసీమతో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు'

పట్టిసీమ ప్రాజెక్టుతో సీఎం చంద్రబాబు నాయుడుకు రూ. 300 కోట్ల ముడుపులు అందుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

పట్టిసీమ ప్రాజెక్టుతో సీఎం చంద్రబాబు నాయుడుకు రూ. 300 కోట్ల ముడుపులు అందుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద పర్యటించి, ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుని.. అనంతరం రైతులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే...

''ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఎంతని ఇంజనీర్లను అడిగితే 3 టీఎంసీలని చెప్పారు. అంటే, దానర్థం.. గోదావరి నది నీటిని ఇక్కడకు మళ్లిస్తే పట్టిసీమ దగ్గరనుంచి ప్రకాశం బ్యారేజి వరకు ఎక్కడా కనీసం నీళ్లు నిల్వచేసే సామర్థ్యం కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి నుంచి నీళ్లు ఎన్ని రోజులు సముద్రంలో కలుస్తాయని అడిగాను. కృష్ణానది మాత్రమే గత ఏడేళ్లుగా దాదాపు 80-90 రోజులు పొంగుతోంది, సముద్రంలోకి నీళ్లు కలుస్తాయని చెప్పారు. ఈ నీళ్లు కలిసేది కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమే. నిన్న ధవళేశ్వరం, పోలవరం దగ్గర అడిగితే.. అక్కడ కూడా ఇంచుమించు ఇదే నెలల్లోనే నీళ్లు సముద్రంలో కలుస్తాయన్నారు. రెండు నదులూ కూడా ఇంచుమించు ఒకే సమయంలో పొంగుతాయ. మన రుతుపవనాల కాలంలోనే నదులు పొంగి సముద్రంలోకి కలుస్తాయి. రాష్ట్రానికి ఏదైనా మంచి జరగాలంటే ఆ నదులు సముద్రంలో కలిసే సమయంలో.. నీళ్లు నిల్వచేసుకుని, తర్వాత వరద అయిపోయాక అవేనీళ్లు వాడుకునే ప్రాజెక్టే.. పోలవరం ప్రాజెక్టు. అక్కడ 124 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వరద తగ్గిన తర్వాత కూడా కుడికాల్వ ద్వారా 80 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా విశాఖ ప్రాంతానికి సుమారు 24 టీఎంసీల నీళ్లు ఇస్తుంది. అలాంటి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజిలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సిన పనిలేదు, పనులు మొదలైతే చాలని అంటున్నారు. పట్టిసీమ మొదలైతే 35 టీఎంసీల నీళ్లు మనకు రాకుండా పోతాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు పంపకుండా కట్టడి చేసే ప్రమాదం ఉందని తెలిసికూడా కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే పట్టిసీమను చేపడుతున్నారు. పక్కనే పులిచింతల ప్రాజెక్టు ఉంది. దీని పనులు వైఎస్ఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. దానికి చంద్రబాబు తొమ్మిదేళ్లలో కేవలం 24 కోట్లు మాత్రమే కేటాయించారు. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి 90 శాతం పూర్తిచేశారు. దానికి మరో 290 కోట్లు మాత్రమే అవసరం. అది పూర్తయితే 40 టీఎంసీల నీళ్లు నిల్వచేసుకోవచ్చు. అలాంటి ప్రాజెక్టుకు చంద్రబాబు కేటాయించింది కేవలం 20 కోట్లు మాత్రమే. ఈ 290 కోట్లలో భూసేకరణకు, ఆర్అండ్ఆర్కు 170 కోట్లు అవసరం అవుతాయి. కృష్ణానది నుంచి 200 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. సగటున 80-90 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. పట్టిసీమను ఏడాదిలో పూర్తిచేయాలని టెండర్లు పిలిచారు. చివరకు కేవలం ఇద్దరు కాంట్రాక్టర్లను మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు. వాళ్లిద్దరూ కూడా 21.9 శాతం ఎక్సెస్కు కోట్ చేశారు. మళ్లీ అందులో 5 శాతం ఎక్సెస్, మరో 16.9 శాతం బోనస్గా ఇస్తామని చెప్పారు. పట్టిసీమ వల్ల చంద్రబాబుకు 300 కోట్ల ముడుపులు అందుతున్నాయి. వాటి కోసం చంద్రబాబు రాష్ట్ర రైతాంగాన్ని హోల్ సేల్ గా అమ్మేస్తున్నారు. రాయలసీమపై చంద్రబాబు కపటప్రేమ చూపిస్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా.. కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం రాయలసీమ పేరును వాడుకుంటున్నారు.''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement