రాష్ట్రానికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వండి: కేంద్రం | Central Government asked all particulars regarding the Andhra Pradesh State for bifurcation | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వండి: కేంద్రం

Oct 16 2013 2:03 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్రానికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వండి: కేంద్రం - Sakshi

రాష్ట్రానికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వండి: కేంద్రం

రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ నెల 17వ తేదీ (గురువారం) లోపు అందించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మంగళవారం (15వ తేదీ) లేఖ రాసింది.

రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ఇందుకోసం రాష్ట్రానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ నెల 17వ తేదీ (గురువారం) లోపు అందించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మంగళవారం (15వ తేదీ) లేఖ రాసింది. ఈ నెల 19వ తేదీన (శనివారం) మంత్రివర్గ బృందం (జీవోఎం) సమావేశం కానుందని ఈ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం లోపు సమాచారాన్ని అందించాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని శాఖలు గురువారం నాటికి సమాచారాన్ని అందించేందుకు కసరత్తు ప్రారంభించాయి. విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచించింది. 
 
 కేంద్ర శాఖలకు అనిల్‌గోస్వామి లేఖలు...
 రాష్ట్ర విభజన నేపథ్యంలో.. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలూ సంబంధిత సమాచారం పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఈ నెల 11వ తేదీన లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా (ఫాస్ట్ ట్రాక్ బేసిస్‌లో) పూర్తి చేయాల్సి ఉందని.. ఇందుకోసం 17వ తేదీలోపు సమాచారాన్ని అందించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన కేంద్ర మంత్రుల బృందం రెండో దఫా సమావేశం కానుందని కూడా ఈ లేఖలో ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతి శాఖకు సంబంధించి ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలను కూడా ఆదేశించినట్లు తెలిసింది. 
 
 ప్రధానమైన మూడు అంశాలు...
 ఆయా శాఖలు 1) సంబంధిత రంగం ఏయే ప్రాంతాల్లో ఎలా విస్తరించి ఉంది, 2) ఇరు ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల వివరాలు 3) ఉద్యోగుల సమాచారం అనే మూడు పాయింట్ల వారీగా వివరాలను అందించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ సమాచారంపై ఆధారపడి ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు - అప్పులతో పాటు ఉద్యోగులను పంపకం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతీ రంగం రాష్ట్రంలోని ఏ ప్రాంతం లో అధికంగా విస్తరించి ఉంది? ఏ ప్రాంతంలో తక్కువగా ఉందని తెలుసుకోవడం ద్వారా ప్రత్యేక ప్యాకేజీ లాంటివాటిపైనా 19న జరిగే సమావేశంలో చర్చించే వీలుందని ఆ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement