
గ్యాస్‌కు ఆధార్ అక్కర్లేదు
వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట! ఇక ఆధార్ తిప్పలు తొలగనున్నాయి.
నగదు బదిలీ నుంచి తాత్కాలిక మినహాయింపు
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట! ఇక ఆధార్ తిప్పలు తొలగనున్నాయి. సిలిండర్‌ను మార్కెట్ రేటుకు కొనడం, తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్ము కోసం ఎదురుచూడడం వంటి బాధలు తప్పనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం నుంచి వంటగ్యాస్‌ను తాత్కాలికంగా మినహాయించనుంది. అంటే ఎప్పట్లాగే సబ్సిడీ ధరకు వినియోగదారులకు గ్యాస్ బండ అందనుంది. సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం చమురు సంస్థలకు చెల్లించనుంది. అలాగే ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రస్తుతం ఉన్న తొమ్మిదికి బదులు ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. గురువారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 12కు పెంచడం వల్ల ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.5 వేల కోట్ల భారం పడనుందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ‘‘వంటగ్యాస్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. అయితే ఇది పథకం అమలులో విఫలమైనట్టు ఎంత మాత్రం కాదు. ఇప్పటిదాకా దీన్ని చక్కగా అమలు చేసినందుకు గర్వపడుతున్నాం. చిన్న తప్పు ఉన్నా దాన్ని సరిచేయాల్సిందే. అందుకే వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందులపై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశాం. అప్పటిదాకా వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాత విధానమే అమలవుతుంది’’ అని మొయిలీ వివరించారు. అయితే కమిటీకి సంబంధించిన విషయాలుగానీ, ఆ కమిటీ ఎంత గడువులోగా నివేదిక ఇస్తుందన్న అంశాన్నిగానీ ఆయన వెల్లడించలేదు. సబ్సిడీ సిలిండర్ల పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుత విధానం ప్రకారం మార్చి వరకు తొమ్మిది సిలిండర్లే వాడుకునే అవకాశం ఉండగా.. మరో సిలిండర్‌ను అదనంగా ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. 2012 సెప్టెంబర్‌లో వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను ప్రభుత్వం ఆరుకు కుదించడంతో దీనిపై విమర్శలు రావడంతో 2013 జనవరిలో వాటిని 9కి పెంచారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సదస్సులో వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.
‘ప్రత్యక్షం’గా తెలిసిసొచ్చింది..
వివిధ పథకాల్లో సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోందని, దీన్ని నివారించేందుకు లబ్ధిదారులకే నేరుగా సబ్సిడీని అందించాలన్న ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్నితీసుకువచ్చింది. దీన్ని వంటగ్యాస్‌కు వర్తింపజేయడంతో వినియోగదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. తొలుత ఆధార్ నమోదు చేయించుకోవడం, తర్వాత వారి బ్యాంకు ఖాతాలను దానికి అనుసంధానం చేసుకోవడానికి జనం అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ చాలాచోట్ల పూర్తిస్థాయిలో ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తికాలేదు. తీరా అనుసంధానం చేసుకున్నా తమ ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ రావడం లేదంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం నుంచి వంటగ్యాస్‌ను తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లోని 289 జిల్లాల్లో వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీని వర్తింపజేస్తున్నారు.
‘వక్ఫ్’ బిల్లుకు ఓకే: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఓకే చెప్పింది. అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను ముస్లింలు తిరిగి చేజిక్కించుకునేందుకు ఈ బిల్లు (ద వక్ఫ్ ప్రాపర్టీస్-ఎవిక్షన్ ఆఫ్ అన్ ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్) దోహదపడనుంది. అంతేగాక వీటిని ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఓబీసీ జాబితాకు సవరణ
ఓబీసీ జాబితాలో కొత్తగా మరో 60 కులాలను చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లతోపాటు 13 రాష్ట్రాల్లో తాము గుర్తించిన కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కమిషన్ సిఫారసుల మేరకు జాబితాలో 115 మార్పు చేర్పులు చేయనున్నారు. ఇప్పటివరకు జాబితాలో మార్పుల కోసం 30 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజా సవరణ కోసం కోసం 31వ నోటిఫికేషన్ విడుదల కానుంది.