
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ విడుదల
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈనెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారు.
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈనెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ ను తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. మొదటి విడతగా జిల్లాలోని 6 నియోజక వర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల కలుసుకోనున్నట్టు ఆయన తెలిపారు. వారంపాటు నిర్వహించే తొలి విడత పరామర్శ యాత్రలో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో పరామర్శ యాత్ర కొనసాగుతుందని పొంగులేటి వివరించారు.
ఈ సందర్భంగా మునుగోడు వైఎస్ఆర్ సీపీ నేత గవాస్కర్ రెడ్డి రూపొందించిన 'వైఎస్ఆర్ సీపీ డైరీ 2015' అనే మొబైల్ యాప్ ను పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.