పోలీసుస్టేషన్‌ ముందే నిప్పంటించుకున్నాడు

Young man committed suicide at Banjara Hills Police Station - Sakshi

     తల్లిదండ్రులపై మామ కేసు పెట్టినందుకు ఆగ్రహం 

     స్టేషన్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్‌ఈఎల్‌ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్‌(24) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్‌ 7న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్‌ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్‌కుమార్, సోదరుడు సాయికుమార్‌ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్‌కుమార్‌లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీ‹శ్‌.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్‌ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్‌కు ఫోన్‌ చేశారు. కౌన్సెలింగ్‌ ఇస్తామని చెప్పి స్టేషన్‌కు రమ్మన్నారు.  

మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... 
బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సతీశ్‌.. మరోసారి మామకు ఫోన్‌ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్‌ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్‌డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top