
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సీతారామచంద్రారావు, ఒద్దిరాజు రాఘవరావులు ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి చెందారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, ఉర్దూ, పారశీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. ‘విజ్ఞాన ప్రచారిణి’ పేరుతో గ్రంధమాలను నిర్వహించారు. ఎంతో ధైర్యసాహసాలతో 1922 ఆగస్టులో ‘తెనుగు’ అనే వారపత్రికను స్థాపించారు. వారే çస్వయంగా సైకిల్‌పై తిరుగుతూ పత్రికను విక్రయించేవారు. 1000 ప్రతులను ముద్రించేవారు. ఆరేళ్ల పాటు ఈ పత్రిక నడిచింది. ఒద్దిరాజు సోదరులు కొన్ని సాంప్రదాయ రచనలు చేశారు. ప్రబంధ పద్యాలు రాశారు. చారిత్రక నవలలతో దేశభక్తిని, త్యాగనిరతిని ప్రబోధించారు. సాంఘిక నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘నౌకాభంగం’ నవలను తెనిగించారు.
షడ్రుచుల ‘పద్యా’న్నం!
లింగ నిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూ
లింగని సంగతాళి లవలింగని కర్దమ దూషితం మృణా
లింగని కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృ నా
లింగని రామలింగ కవిలింగని కీర్తి హసించు వేడుకన్
పద్యాల్లో కొన్నిటికి అర్థం వల్ల మరికొన్నింటికి శబ్దవైచిత్రి వల్ల పేరొస్తుంది. ఈ చాటు పద్యం రెండో కోవకు చెందుతుంది. తెనాలి రామలింగడికి ధిషణాహంకారం ఎక్కువ. పద్యంలో లింగ శబ్దం ప్రతిసారి మరోపదంతో కలిసి చూసి అనే అర్థంలోనే తళుక్కు మంటుంటుంది. చంద్రునికి మచ్చ ఉంది, శివుని కంఠం నలుపు, తెల్లని లవలీ తీగ మీద నల్లని తుమ్మెదలు. తామరతూటికేమో బురద. నల్లని వస్త్రంలో తెల్లని బలరాముడు. ధవళం ధగధగలాడే సరస్వతి జట్టు నల్లన. చూశారా...ఎంత తెల్లగా ఉన్నా... వారికి ఏదో నలుపు అంటక తప్పలేదు. రామలింగని కీర్తిమాత్రం తెల్లగా నవ్వుతోంది!
..: రామదుర్గం