మాకొద్దు బాబోయ్‌!

Wine shop owners on liquor licence Expansion - Sakshi

మద్యం లైసెన్సులపై వైన్‌ షాపు ఓనర్ల  ఆవేదన

రెన్యువల్‌ చేసుకునేందుకు 80% మంది అనాసక్తి

నెల రోజులు రెన్యువల్‌ చేసుకుంటే లాభంకన్నానష్టమే ఎక్కువ 

నెల రోజులపాటు ప్రభుత్వం పొడిగించిన మేర వైన్‌ షాపులు నిర్వహించేందుకు దుకాణాల యజమానులు వెనుకంజవేస్తున్నారు. వైన్‌ షాపులను రెన్యువల్‌ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా నెల రోజులపాటు షాపు నడిపితే తమకు లాభం రాకపోగా, నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. మద్యం అమ్మినందుకుగానూ ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ లైసెన్స్‌ ఫీజుకు కూడా సరిపోదని, షాపు నిర్వహణకు అయ్యే ఇతర ఖర్చులు తాము భరించలేమని అంటున్నారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 80 శాతం మంది లైసెన్సులు మళ్లీ రెన్యువల్‌ చేసుకోలేమని తెగేసి చెబుతున్నారు. అయితే ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ముందు లైసెన్స్‌ ఫీజు కట్టి రెన్యువల్‌ చేసుకోవాలని ఆ తర్వాతే ఏదైనా మాట్లాడదామని అంటుండటం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్‌

వైన్‌ షాపుల లెక్కలివీ.. 
ప్రస్తుతం రాష్ట్రంలో 2,216 వైన్‌ షాప్‌లు నడుస్తున్నాయి. వీటికిగాను గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు కింద యజమానులు ఏటా రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.3.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మున్సిపాల్టీల్లో రూ.55 లక్షల లైసెన్స్‌ ఫీజు.. అంటే నెలకు రూ.4.58 లక్షలు, కార్పొరేషన్‌లలో రూ.1.10 కోట్లు ఫీజు ఉండగా, నెలకు రూ.9.16 లక్షలు లైసెన్స్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సెప్టెంబర్‌ 30తో లైసెన్స్‌ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్‌ ఒకటి నుంచి నెల రోజులపాటు లైసెన్స్‌ పొడగించుకోవాలని ఉత్తర్వులిచ్చింది.

ఈ ఉత్తర్వుల మేరకు లైసెన్స్‌ ఫీజులు కడితే గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబర్‌ నెలకి రూ.3.75 లక్షలు లైసెన్స్‌ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి రూ. 2.50 లక్షల కౌంటర్‌ అవుతుందనుకున్నా, నెలకు రూ. 77.50 లక్షల కౌంటర్‌ ఉంటుంది. ఇందులో యజమానికి 4.4 శాతం కమీషన్‌ ద్వారా వచ్చేది రూ. 3.41 లక్షలు మాత్రమే. అంటే లైసెన్స్‌ ఫీజుకన్నా ఈ మొత్తం 34 వేలు తక్కువ. దీనికి తోడు షాపుల అద్దె, జీతాలు, పవర్‌ బిల్లు, రవాణా ఖర్చులు కలిపి మరో రూ.2.30 లక్షల వరకు ఖర్చవుతుంది.

ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోనే కనిష్టంగా 2.64 లక్షల మేర యజమానులకు నష్టం ఉంటోంది.   ఈ నేపథ్యంలో టర్నోవర్‌ ట్యాక్స్‌ను 8  నుంచి 4శాతం తగ్గించాలని షాపుల యజమానులు కోరుతున్నారు. అలా అయితే తమకు కొంత లాభం వస్తుందంటున్నారు. లేదంటే లైసెన్స్‌ ఫీజు కట్టినప్పుడల్లా ఆ మొత్తానికి ఏడింతలు విలువచేసే మద్యం 18 శాతం కమీషన్‌ చొప్పున ఇచ్చే ఆనవాయితీ ఉందని, ప్రభుత్వం దానిని కొనసాగిస్తే ఎలాగోలా నెట్టుకొస్తామని దుకాణదారులు అంటున్నారు.

ఇక 5.6 శాతంగా ఉన్న వ్యాట్‌ను  యథాతధంగా చెల్లిస్తామని చెబుతున్నారు. ఇదే విషయమై కొందరు యజమానులు ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలవగా, ముందు షాపుల రెన్యువల్‌కు లైసెన్సు ఫీజు కట్టాలని, తర్వాతే ఏదైనా చర్చిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత విధానంతో రెన్యువల్‌ లైసెన్స్‌ ఫీజును కట్టడానికి 80% యజమానులు సుముఖంగా లేరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top