
పక్కా పనులేవి?
మేడారం జాతరకు వచ్చే భక్తులతో పాటు పరిసరాల్లోని గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2013లో రూ.10 కోట్లు మంజూరు చేసింది.
► మేడారంలో తాత్కాలికంగానే తాగునీటి పనులు
► పదేళ్లుగా చేస్తున్నా.. ఇంకా కొరతే
►చేసిన పనులనే.. కొత్తగా చూపుతున్న అధికారులు
► నిధులు స్వాహా చేసేందుకేనని అనుమానాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం జాతరకు వచ్చే భక్తులతో పాటు పరిసరాల్లోని గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2013లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. సామూహిక రక్షిత తాగునీటి పథకం(సీపీడబ్ల్యూఎస్) - జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డబ్లూపీ) కింద గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో పనులను వెంటనే మొదలు పెట్టాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. 2014లో జరిగిన మేడారం జాతర వరకే ఈ నిధులతో పనులు పూర్తి కావాల్సి ఉంది.
అరుుతే.. జాతర గడువు దగ్గరగా ఉన్నందున వెంటనే పనులు పూర్తి చేయలేమని, 2016 జాతరలో భక్తులకు ఉపయోపడేలా చేస్తామని జిల్లా అధికారులు అప్పట్లో ఉన్నతాధికారులకు నివేదించారు. 2014 జాతర ముగిసిన తర్వాత ఈ నిధుల విషయాన్ని జిల్లా అధికారులు పట్టించుకోలేదు.
కాంట్రాక్టుల కోసమేనా...
మేడారం జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012లో రూ.4 కోట్లు, 2014లో రూ.6 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులతో ఇప్పటి వరకు సుమారు 35 కిలోమీటర్ల దూరం వరకు పైపులైను నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అరుుతే, క్షేత్ర స్థాయిలో మాత్రం ఇంత దూరం పైపులైను నిర్మాణం జరగలేదనే విమర్శలు ఉన్నాయి. సామూహిక రక్షిత తాగునీటి పథకం(సీపీడబ్ల్యూఎస్)- జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం(ఎన్‌ఆర్‌డబ్లూపీ) కింద శాశ్వత నిర్మాణాలు పూర్తి చేస్తే ప్రతి ఏటా తాగునీటి అవసరాల పేరిట చేసే తాత్కాలిక పనులకు ఆస్కారం ఉండదని, ఈ కారణంగానే గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు శాశ్వత నిర్మాణ పనులపై దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి.
భక్తుల తాగునీటి అవసరాల కోసం ప్రతి జాతర సందర్భంలో ఇన్‌ఫిల్టరేషన్ బావులు, మోటార్లు, పైపులైన్లు వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, పదేళ్లుగా పనులు చేస్తున్నా పూర్తి స్థాయిలో లక్ష్యం చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి.. చేసిన పనులనే మళ్లీ కొత్తవిగా చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు అందించే సీపీడబ్ల్యూఎస్-ఎన్‌ఆర్‌డబ్లూపీ అమలు కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. అందుకు చేపట్టే పనుల సర్వే కోసం రూ.10 లక్షలు విడుదల చేసింది. అరుుతే, సర్వే చేసి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపామని చెబుతున్న అధికారులు పూర్తి స్థాయిలో నిధుల విడుదల విషయాన్ని మరిచిపోవడానికి కారణామలు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.