కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం 

We Try Vote Share From Krishna Godavari Rivers Said By T.Rammohanreddy - Sakshi

జలసాధనకు క్షేత్రస్థాయి నుంచి పార్టీ రహిత ఉద్యమాలు

ప్రాణహిత డిజైన్‌ మార్పుతో ఇబ్బందులు    

సాక్షి,పరిగి: ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు సాధించే వరకు చేవెళ్ల జలసాధన సమితి పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు రాకుండా కుట్రలు చేస్తున్న కేసీఆర్‌ ఇక్కడి రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి జిల్లాకు రెండు నదుల నుంచి 20 టీఎంసీలు సాధించేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీల రహితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.దివంగత వైఎస్సార్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు, పాలమూరు ఎత్తిపోతల నుంచి 10 టీఎంసీల నీళ్లు కేటాయించారని తెలిపారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ప్రాణహితను దూరం చేసి పాలమూరు ఎత్తిపోతల నుంచి రావాల్సిన నీటి వాటాను 10 టీఎంసీల నుంచి 2.8 టీఎంసీలకు కుదించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్‌ఎస్‌ సర్కారు మోసం చేస్తుంటే మరోవైపు రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంటా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్‌ మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎవరూ లేరని వరంగల్‌ జిల్లా నాయకుడిని ఎంపీ అభ్యర్థిగా దిగుమతి చేసుకున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ అతిథిలాగా ఎన్నికలప్పుడే కనిపిస్తారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన సీఎం మళ్లీ ఈ ఎన్నికల్లో కనిపించారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ...నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చార్మినార్‌ జోన్‌లో కలపాలని ఉద్యమిస్తే పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తానని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సంగారెడ్డికి, చార్మినార్‌కు, వికారాబాద్‌కు జోగులాంబకు సంబంధమేంటని ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సుభాష్‌చందర్‌రెడ్డి, కొమిరె లక్ష్మయ్య, నారాయణ్‌రెడ్డి, లాల్‌కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top