
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత పరిస్థితి
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. కృష్ణా ప్రాజెక్టుల్లో ఏకంగా 554 టీఎంసీలు, గోదావరిలో 156 టీఎంసీల నీటి కొరత ఉండటంతో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కృష్ణా బేసిన్‌లో దిగువకు నీటిని పంపే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులూ తీవ్ర నీటి కొరతను ఎదు ర్కొంటున్నాయి. కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో ఏకంగా 185 టీఎంసీల నీటి కొరత ఉండటం, అవి నిండితే కానీ దిగువ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
గణనీయంగా పడిపోయిన మట్టాలు
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది కాస్త ఆలస్యంగా భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయి. అయితే ఖరీఫ్, రబీ సీజన్లలో అక్కడ గణనీయమైన సాగు జరగడంతో ఆ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 167 టీఎంసీల నిల్వకు గానూ కేవలం 51 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. తుంగభద్ర పరీవాహకంలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ 31 టీఎంసీల నిల్వలున్నాయి. దీంతో మొత్తంగా ఎగువ ప్రాజెక్టుల్లోనే దాదాపు 186 టీఎంసీల నీటి కొరత కనబడుతోంది. ఎగువన సుమారు 150 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు వరద వచ్చే అవకాశాలుంటాయి. ఇది జరగడానికి మరో నెలన్నర కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రాజెక్టులు ఖాళీ..
రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 368 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ఈ మూడు ప్రాజెక్టుల్లోకి నెల వ్యవధిలో కేవలం 3 టీఎంసీల కొత్త నీరు మాత్రమే వచ్చి చేరింది. జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 90 నుంచి 100 టీఎంసీల మేర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన సైతం ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు అందిచ్చేపరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితిల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
గోదావరి అంతే
గోదావరి బేసిన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అసలు ప్రవాహాలు కానరావడం లేదు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూర్, కడెం, ఎల్లంపల్లిలలో కేవలం 8 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టుల్లో 190 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యం ఉండగా ఏకంగా 156 నీటి లోటు ఉంది. జూలై, ఆగస్టు వర్షాలపైనే సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు మిషన్ భగీరథ అవసరాలకు 60 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ దృష్ట్యా తాగునీటికి అవసరమైన నిల్వలు పక్కకు పెట్టిన తర్వాతే సాగు నీటి కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
శ్రీశైలం వెలవెల
రాష్ట్రానికి సాగు, తాగునీటి వరప్రదాయిని అయిన శ్రీశైలం జలాశయానికి ఇంకా వరద మొదలుకాలేదు. దీంతో జలాశయం వెలవెలబోతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885.0 అడుగులు కాగా, ఆదివారం నాటికి 800.1 అడుగుల నీరు (29.0552 టీఎంసీలు) ఉంది. వాటర్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు పూర్తయినా ఇంత వరకు ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి నీటి ప్రవాహం రాలేదు.
కర్ణాటక, రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో)
ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ కొరత
ఆల్మట్టి 129.72 27.55 102.17
నారాయణపూర్ 37.64 24.02 13.62
తుంగభ్రద 100.86 31.20 69.66
జూరాల 9.65 5.85 3.81
శ్రీశైలం 215.81 29.06 186.75
సాగర్ 312.05 133.72 178.33
సింగూర్ 29.91 7.81 22.10
నిజాంసాగర్ 17.80 2.37 15.43
ఎస్సారెస్పీ 90.31 10.17 80.14
కడెం 7.60 4.62 2.98
లోయర్ మానేరు 24.07 3.44 20.63
ఎల్లంపల్లి 20.18 6.08 14.10