వరంగల్ ఎంపీ రాజయ్య కుమారునిపై గృహహింస కేసు | Warangal MP rajaiah consequences of domestic violence case | Sakshi
Sakshi News home page

వరంగల్ ఎంపీ రాజయ్య కుమారునిపై గృహహింస కేసు

Apr 27 2014 2:44 AM | Updated on Sep 2 2017 6:33 AM

వరంగల్ ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడు అనిల్‌పై కోడలు ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు నమోదైంది.

హైదరాబాద్: వరంగల్ ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడు అనిల్‌పై కోడలు ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు నమోదైంది. ఏసీపీ మనోహర్ చెప్పిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన సారిక, రాజయ్య కుమారుడు అనిల్‌కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు ప్రేమించుకున్నారు. 2002లో వెస్ట్‌మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయారు. 2005లో తిరిగి వచ్చాక, పెద్దల కోరిక మేరకు 2006లో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

అనంతరకాలంలో అనిల్ మరో మతానికి చెందిన యువతితో  సహజీవనం చేయసాగాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సారిక తన అత్తమామలకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో సారిక ఉద్యోగం చేసి సంపాదించిన రూ.30 లక్షలు, 20 తులాల బంగారు నగలు తన భర్తకే ఇచ్చింది. అయినప్పటికీ వేధింపులు పెరగడంతో సారిక నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కోర్టు ఎంపీ రాజయ్యపై, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనిల్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 498ఏ,494,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. రాజయ్యపై, ఆయన భార్య వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధవిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement