ఆశ్రమ పాఠశాలను సందర్శించిన యూనిసెఫ్‌ బృందం

UNICEF Representatives Visited Model School In Asifabad - Sakshi

తరగతి వారీగా బోధన, సౌకర్యాల పరిశీలన 

సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్‌): మండలంలోని వాంకిడి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, బంబార ఆశ్రమ ఉన్నత పాఠశాలలను శుక్రవారం యూనిసెఫ్‌ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ, ప్రథం, వేదిక్‌ మ్యాథ్స్, వందేమాతరం, దిశ మోడల్‌ స్కూల్‌ నిర్వహణ విషయాలు పరిశీలించారు. అనంతరం తరగతి వారీగా విద్యార్థులకు బోధన అంశాలపై, మధ్యాహ్న భోజన నిర్వహణ, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. యూనిసెఫ్‌ ఎడ్యుకేషనల్‌ చీఫ్‌ రాంచంద్రరావు బెగూర్‌ మాట్లాడుతూ గత నవంబర్‌మాసం నుంచి ఆయా పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని తెలిపారు. అప్పటి నుంచి కార్యక్రమాల తీరుపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థుల్లో వచ్చిన మార్పులపై వివరాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల పనితీరు బట్టి ఆయా పాఠశాలల్లో కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించడమే యూనిసెఫ్‌ ముఖ్యఉద్దేశమన్నారు. వారి వెంట యూనిసెఫ్‌ స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ స్పెషలిస్టు సుకన్య, ఐటీడీఏ పీవో కష్ణ ఆదిత్య, డీటీడీవో దిలీప్‌కుమార్, ఏటీడీవో కనకదుర్గ, హెచ్‌ఎండి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్‌: దిశ మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గిరిజన అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిష్ట్ర ఆదిత్య అన్నారు. శుక్రవారం మండలంలోని వట్టివాగు కాలనీలో పైలెట్‌ ప్రాజెక్టు కింద నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మోడల్‌ స్కూల్‌ను సెంట్రల్‌ స్టేట్‌ యూనిసెఫ్‌ ప్రతినిధి రామ చంద్రన్, డీటీడీవో దిలీప్‌కుమార్‌ సందర్శించి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంగ్లిష్‌ మీడియం బోధన సౌకర్యాలు, హాజరు శాతం, మెనూ ప్రకారం భోజనం వంటి విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యా సామర్థాలు, నైపుణ్యాలు ప్రదర్శించడంతో అభినంధించారు. దీంతోపాటు గ్రామస్తులు పాఠశాల చుట్టు ప్రహరీ గోడ, కమ్యూనిటీ భవనం నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, సీఆర్పీ రవీందర్‌ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top