విద్యుత్‌ శాఖలో బదిలీల లొల్లి..

TSNPDCL Employees Serious On Transfers Late In Karimnagar - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌) : ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియ శనివారం రాత్రి ఓ కొలిక్కి వచ్చింది. సబ్‌ ఇంజినీర్లు సహా ఆఫీసు, ఫీల్డ్‌ విభాగానికి సంబంధించిన ఉద్యోగుల బదిలీలు చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి బదిలీల ప్రక్రియపై లొల్లి నెలకొంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం వరకే బదిలీలు పూర్తి చేసి లిస్టు ప్రదర్శించాల్సిన అధికారులు ట్రేడ్‌ యూనియన్ల ఒత్తిళ్లకు తలొగ్గి బదిలీల ప్రక్రియను ఆలస్యం చేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది పోస్టింగ్‌ల కోసం ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇంజినీర్ల బదిలీల్లో నిబంధనలు పాటించడం లేదంటూ, ఒకే యూని యన్‌కు అనుకూలంగా ఎస్‌ఈ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఈఏ) కరీంనగర్‌ బ్రాంచి ఆధ్వర్యంలో ఎస్‌ ఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్‌ఈకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఈఏ కరీంనగర్‌ బ్రాంచి సెక్రటరీ కె.అంజయ్య మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఇంజినీర్ల బదిలీలు చేపడుతున్నారని, ఓ యూనియన్‌కు వత్తాసు పలుకుతూ ఎస్‌ఈ చేపడుతున్న బదిలీలు సరికావని ఆరోపించారు. మహిళలని చూడకుండా గతంలో అటవీ ప్రాంతాకు సమీపంలో పోస్టింగ్‌లు ఇచ్చారని, ప్రస్తుతం కూడా అదే పద్ధతి అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

విద్యుత్‌ శాఖను భ్రష్టు పట్టిస్తున్న ఎస్‌ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్నాలో కోశాధికారి జి.రఘు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఎన్‌.అంజయ్య, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రదీప్, కె.గంగారాం, కార్యదర్శులు పి.అశోక్, ఎ.నరేష్, డీఈలు గంగాధర్, బాలయ్య, ఏడీలు వి.ప్రభాకర్, సాగర్, ఏఈలు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయ గేట్‌ ఎదుట చేపడుతున్న ఇంజినీర్ల నిరసనపై స్పందించిన ఎస్‌ఈ కె.మాధవరావు వారిని చర్చలకు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు సైతం ఆందోళన చేపట్టారు.

పలు విభాగాల్లో పోస్టింగ్‌లు..
ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని సాధారణ బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా నిరీక్షిస్తున్న ఉద్యోగులకు శనివారం రాత్రి ఊరట లభించింది. ఇంకనూ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. శుక్రవారంతో బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. పైరవీలు, ఒత్తిళ్ల మేరకు పలు విభాగాల పోస్టింగ్‌లు శనివారం ప్రకటించారు. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (జేఏఓ) 12, జూనియర్‌ అసిస్టెంట్‌ 48, సీనియర్‌ అసిస్టెంట్‌ 20, ఆఫీసు సబార్డినేట్స్‌ 18, స్వీపర్లు 3, ఫోర్‌మెన్‌ (గ్రేడ్‌ 1) 7, సబ్‌ ఇంజినీర్‌ 18లను బదిలీ చేస్తూ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా.. సర్కిల్‌ పరిధిలోని కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలోని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ 5, లైన్‌మెన్‌ 67, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ 3, జూనియర్‌ లైన్‌మెన్‌ 2 బదిలీ లిస్టును శనివారం రాత్రి డీఈ రాజారెడ్డి ప్రకటించారు. ఇందులో కొంతమందికి ఆప్షన్‌ ప్రకారం, మరికొంత మందికి ఆప్షన్‌కు విరుద్ధంగా పోస్టింగ్‌లు కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తమైంది. రెండు రోజులుగా పోస్టింగ్‌ల కోసం సిబ్బంది ఎదురుచూస్తుండటంతో ఎస్‌ఈ కార్యాలయం సందడిగా కనిపించింది.  

పారదర్శకంగా బదిలీలు 
కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని సాధారణ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాం. అన్ని యూనియన్ల నాయకులతో చర్చించాకే బదిలీలు చేపడుతున్నాం. ఇంజినీర్ల బదిలీలపై ఓ తుది నిర్ణయం వెలువడకముందే నిందారోపణలు వేయడం సరికాదు. అందరికీ ఆమోదయోగ్యంగానే బదిలీలు జరుగుతాయి.
– కె.మాధవరావు, ఎస్‌ఈ, కరీంనగర్‌ సర్కిల్‌

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top