టీఆర్‌ఎస్‌ గెలిస్తే..నిరంజన్‌రెడ్డి సర్వీస్‌ ట్యాక్స్‌..

Trs Leader Niranjan Reddy Involved Many Scams - Sakshi

ఎన్నికల యుద్ధంలో మమ్మల్ని ఎవరూ తట్టుకోలేరు 

కార్యకర్తలతో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి 

సాక్షి, ఖిల్లాఘనపురం: డిసెంబర్‌ 11 తరువాత నీళ్ల నిరంజన్‌రెడ్డి.. కన్నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సవాల్‌ విసిరారు. బుధవారం స్థానిక పద్మశాలి కల్యాణ మండపంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతా సిద్ధం చేసిన తరువాత వచ్చి నీళ్లు తెచ్చానని, నీళ్ల నిరంజన్‌రెడ్డి గా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

నిరంజన్‌రెడ్డి గెలిస్తే జీఎస్టీ తరహాలో ఎన్‌ఎస్టీ (నిరంజన్‌రెడ్డి సర్వీస్‌ ట్యాక్స్‌) వేస్తారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రోజు రాత్రి రూ.12 కోట్ల అవినీతి సొమ్ముతో 29 కిలోల బంగారం కొన్న అవినీతి పరుడా వనపర్తిలో గెలిచేది? అని నిలదీశారు. ఇప్పటివరకు వనపర్తి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా తాను, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేశామన్నారు.

రావుల చంద్రశేఖర్‌రెడ్డి కృష్ణుడిగా, తాను అర్జునుడిగా ఎన్నికల యుద్ధంలో దిగుతున్నామని చిన్నారెడ్డి అభివర్ణించుకుంటూ ఎన్నికల బరిలో తమను తట్టుకునేవారు ఉండబోరని చెప్పారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరిస్తాన్న వారు కొత్తగా 12వేల ఎకరాలకే ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ నిరంజన్‌రెడ్డికి వ్యతిరేకంగా తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రతినబూనారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, శివసేనారెడ్డి, నాగం తిరుపతిరెడ్డి, సతీష్, డాక్టర్‌ నరేందర్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కొండారెడ్డి, కృష్ణయ్యయాదవ్, బాల్‌రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top