దొరికిన ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ నిందితులు

Transformer Robbers Caught by Police in Nizamabad - Sakshi

ఆరు మండలాల్లో మహారాష్ట్ర ముఠా హల్‌చల్‌ 

ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు 

పరికరాలు, కాపర్, ఆయిల్‌ రికవరీ 

మద్నూర్‌(జుక్కల్‌): నియోజకవర్గంలో గత కొన్ని రోజులు ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. నిత్యం ఏదో ఒక చోట ట్రాన్స్‌ఫార్మర్‌లను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండాపోయారు. అయినా తప్పు చేసిన వారు పోలీసుల నుంచి తప్పించుకోలేరని ఎస్‌ఐ మహమ్మద్‌ సాజిద్‌ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రాత్రి సమయాల్లో 50 ట్రాన్స్‌ఫార్మర్‌లను పగలగొట్టి ఆయిల్, కాపర్, తదితర వస్తువులను చోరీ చేశారని ఆయన అన్నారు. బిచ్కుందకు చెందిన కర్నాల్‌సింగ్, దారా సింగ్‌(హింగోళీ, మహారాష్ట్ర), శంశేర్‌  సింగ్‌(హింగోళీ, మహారాష్ట్ర), కుల్‌దీప్‌ సింగ్‌(షోలాపూర్, మహారాష్ట్ర) నిందితులు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారన్నారు. బిచ్కుందకు చెందిన కర్నాల్‌సింగ్‌కు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు బంధువులని తెలిపారు. వారు నలుగురు ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందడంతో కేసును చాలెంజ్‌గా తీసుకున్నామన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ నిఘా పెంచామన్నారు.

మండలంలోని పెద్ద తడ్గూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి పాల్పడినప్పుడు గ్రామంలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల్లో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా వారి కదలికలను గమనించగా అనుమానం నిజమైందన్నారు. శనివారం ఉదయం నలుగురు నిందితులను మండలంలోని సలాబత్‌పూర్‌ వద్ద పట్టుకున్నామని, వారి వద్ద చోరీ చేసిన కాపర్‌ తీగలు లభ్యమయ్యాయని చెప్పారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు కుల్‌దీప్‌సింగ్‌ పరారయ్యాడని త్వరలోనే అతడిని పట్టుకుంటామన్నారు. ఈ నలుగురిపై 37 కేసులు నమోదయ్యాయని ఎస్‌ఐ చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే దొంగలు దొరికారని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. నిందితులను పట్టుకున్న వారిలో తనతోపాటు మద్నూర్‌ ఏఎస్‌ఐ వెంకట్రావ్, జుక్కల్‌ ఎస్‌ఐ అభిలాశ్, బిచ్కుంద ఎస్‌ఐ క్రిష్ణ, కానిస్టేబుళ్లు నరేందర్, సంజు, సిబ్బంది ఉన్నారన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top