‘మెదక్‌’ పై టీజేఎస్‌ కన్ను

TJS Kodandaram Target Medak Constituency - Sakshi

సాక్షి, మెదక్‌: టీజేఎస్‌(తెలంగాణ జన సమితి) అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల ప్రచార యాత్రను మెదక్‌ నుంచి  ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో మహాకూటమిలో కేటాయించే అసెంబ్లీ స్థానాల్లో  మెదక్‌ టికెట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలిని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరుపుతూనే మరోవైపు సీట్ల సర్ధుబాటుపైనా మహాకూటమి చర్చలు జరుపుతోంది. పొత్తులో భాగంగా 25 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని టీజేఎస్‌ కోరుతోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ  అన్ని స్థానాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని సమాచారం. మహాకూటమిలో భాగంగా 10 నుంచి 15లోపు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అంశంపై కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు సమచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు స్థానాలు కావాలని టీజేఏసీ కోరుతోంది. మూడు స్థానాల్లో ప్రధానంగా మెదక్‌ అసెంబ్లీ టికెట్‌ విషయమై కోదండరాం పట్టుదలగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీజేఎస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌లో మెదక్‌ టికెట్‌ కోసం 13 మంది నాయకులు పోటీ పడుతున్నారు. దీనికితోడు వారి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయింపు కాంగ్రెస్‌ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మెదక్‌ స్థానాన్ని తమకు వదిలివేయాలని టీజేఎస్‌  వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కోదండరాం సైతం ఇటీవల నాలుగు పర్యాయాలు మెదక్‌ నియోజకవర్గంలో పర్యటించారు. మెదక్‌ నుంచి పార్టీ బరిలో ఉంటుందని, కష్టపడి గెలవాలని పార్టీ శ్రేణులకు  ఇప్పటికే సూచించారు. అయితే మెదక్‌ స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా కనిపించడం లేదు. దీంతో పొత్తులో టీజేఎస్‌కు టికెట్‌ దక్కుతుందా? లేదా? అన్న విషయం వేచి చూడాల్సి ఉంది.

స్వల్ప మార్పులు ఉండే అవకాశం
పొత్తులో మెదక్‌ టికెట్‌ టీజెఎస్‌ వచ్చిన పక్షంలో పోటీ చేసేందుకు  పార్టీ జిల్లా అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీనికితోడు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మెదక్‌ నుంచి ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్‌ నుంచి ప్రచారం ప్రారంభిచటం ద్వారా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపడంతోపాటు ఎన్నికల్లో పార్టీకి కలివస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా 4వ తేదీన మెదక్‌ మండలం పాపన్నపేటలోని ఏడుపాయల నుంచి ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టాలని కోదండరాం నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాబోయే రెండు రోజులు ఆయన కూటమి చర్చల్లో పాల్గొంటారని సమాచారం. దీంతో ప్రచార యాత్ర తేదీల్లో స్వల్పమార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 6 లేదా 7 తేదీల్లో ఈ ప్రచారం ప్రారంభించవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే మెదక్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్న జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.  ఇటీవల చిన్నశంకరంపేట మండలంలో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు. మెదక్‌లో యువజన ర్యాలీ, సభ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పార్టీశ్రేణుల్లో ఉత్సాహాంనింపే ప్రయత్నం చేశారు. మెదక్‌ బరిలో నిలవాలనుకుంటున్న టీజేఎస్‌ జనార్ధన్‌రెడ్డి పార్టీ నాయకులను ఏకతాటి మీదికి తీసుకురావటంతోపాటు జేఏసీలోని అన్నివర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top