మాస్క్‌.. 3 పొరలుంటే భేష్‌

Three Layer Face Mask Better For Safety From Coronavirus - Sakshi

చేతుల శుభ్రత, వ్యక్తుల మధ్య దూరం పాటిస్తేనే కరోనా వ్యాప్తికి చెక్‌

ఒకరి మాస్క్‌లు మరొకరు షేర్‌ చేసుకోవద్దు

నాన్‌ మెడికల్‌ మాస్కులపై డబ్ల్యూహెచ్‌వో సూచనలు  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణతో పాటు, తుంపర్లు, ఇతర రూపాల్లో ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఫేస్‌ మాస్క్‌లు ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం మాస్క్‌లు ధరిస్తేనే సరిపోదని, వైరస్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా మాస్క్‌లను ఉపయోగించడంతో పాటు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తుల మధ్యదూరం (ఒక మీటర్‌) కచ్చితంగా పాటించడం, ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఐపీసీ)పద్ధతులు పాటించడం ద్వారా మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ల వినియోగానికి సంబంధించి, ఎలాంటి మెడికల్, నాన్‌ మెడికల్‌ మాస్క్‌లను ఉపయోగించాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, తదితర అంశాలపై గతంలో జారీచేసిన సూచనలు, సలహాలకు అదనంగా కొత్తవాటిని డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది.

ఎవరు, ఏ పరిస్థితుల్లో ఎటువంటి మాస్క్‌ ధరించాలి?
నాన్‌ మెడికల్‌ మాస్క్‌:
వైరస్‌ వ్యాప్తికి అనుమానాలున్న చోట రక్షణ కోసం సాధారణ ప్రజలు ధరించాలి
సరుకుల దుకాణాలు, ప్రార్థన స్థలాలు, ఇతర జన సమూహాలున్న చోట్ల..
జనాభా ఎక్కువ ఉన్నచోట్ల, మురికివాడలు, ఇరుకు ప్రాంతాల ప్రజలు..
వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించడం సాధ్యం కాని చోట్ల, బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిం చే వారు, క్యాషియర్లు, సర్వర్లు, సోషల్‌ వర్కర్లు..
మెడికల్‌ మాస్క్‌:
భౌతికదూరం పాటించడం సాధ్యం కానిచోట్ల, వైరస్‌ సోకే అవకాశాలున్న చోట్ల.. 60 ఏళ్లకు పైబడిన వారు, గుండెజబ్బులు, డయాబెటిస్‌ వంటి ఇతర సమస్యలున్న వారు..
కేన్సర్, శ్వాసకోశ సమస్యలు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు..
సమాజంలోని అన్నిచోట్లా కరోనా లక్షనాల్లో ఏవైనా ఉన్నవారు, వ్యాప్తి నియంత్రణకు మెడికల్‌ మాస్క్‌ ధరించాలి..

మాస్క్‌ల నిర్వహణ ఎలా ?
ఒక మాస్క్‌ను ఒక్కరే ఉపయోగించాలి
తడిసినప్పుడు లేదా మాసిపోయినప్పుడు మాస్క్‌లను మార్చాలి. తడిచిన వాటిని ఎక్కువ కాలం వాడకూడదు.
నాన్‌ మెడికల్‌ మాస్క్‌లను తరచుగా ఉతకాలి. ఇతర వస్తువులతో కలిసి కలుషితం కాకుండా జాగ్రత్త పడగాలి.
ఎక్కువ వేడిలో ఉతికినా తట్టుకునేలా ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి
మాస్క్‌ ల ను ఉతికేం దుకు వేడినీళ్లు వాడాలి. అవి అందుబాటులో లేని సంద ర్భంలో సబ్బు, డిటర్జెంట్‌తో కూడా వాటిని ఉతకొచ్చు.

నాన్‌ మెడికల్‌ మాస్క్‌ల నిర్వహణ...
ఫ్యాబ్రిక్‌ ఎంపిక :
తుంపర్ల వంటి వాటిని అడ్డుకోవడం, గాలి తీసుకునేందుకు వీలుగా ఉండేలా ఎంపిక.
మాస్క్‌ల తయారీకి సాగే గుణమున్న మెటీరియల్, తక్కువ ఫిల్టర్, ఉతికితే మనగలగని గుడ్డను ఎంపిక చేయరాదు
60 డిగ్రీల ఉష్ణోగ్రతలు తట్టుకునే ఫాబ్రిక్‌ను ఎంపికచేయాలి.

ఉత్పత్తి, తయారీ ఎలా ?
కనీసం మూడు పొరలవి అవసరం. నోటికి తగిలేలా ఇన్నర్‌ లేయర్‌ ఫ్యాబ్రిక్, బయటి పొర బయటి వాతావరణానికి ఇమిడేలా ఉండాలి.
నీటిని పీల్చగలిగే (హైడ్రోఫిలిక్‌) మెటీరియల్‌ ఎంపిక చేయాలి. బయటి, లోపలి పొరలకు తగ్గట్టుగా ఫాబ్రిక్‌ను ఎంపికచేయాలి. బయటి పొర మెటీరియల్‌ లిక్విడ్‌ను పీల్చుకునే గుణం లేనిది (హైడ్రోఫోబిక్‌) అయ్యి ఉండాలి.

మాస్క్‌ సరైన వినియోగం ఇలా
మాస్క్‌ పెట్టుకునే ముందు చేతులు శుభ్రపరచుకోవాలి.
నోరు, ముక్కు కవర్‌ అయ్యేలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముఖం, మాస్క్‌ మధ్య గ్యాప్‌ ఎక్కువగా లేకుండా ఉండేందుకు వెనకవైపు ముడేసుకోవాలి
మాస్క్‌ ధరించినపుడు దానిని పదేపదే తాకరాదు
మాస్క్‌ ముందు భాగాన్ని చేతులతో తాకకుండా, వెనకనుంచి విప్పేలా ఏర్పాటు చేసుకోవాలి
మాస్క్‌లను విప్పిన వెంటనే శానిటైజర్‌తో లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి
సింగిల్‌ యూజ్‌ మాస్క్‌లను ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించరాదు. వాడిన అనంతరం పారవేయాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top