ముంచేస్తున్న ‘మల్టీ’ మోసం 

Thousands of crores scams being with the Companies - Sakshi

వేల కోట్లు కొల్లగొడుతున్న కంపెనీలు

తెలంగాణలోనే రూ.20 వేల కోట్లకుపైగా హాంఫట్‌

ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్‌ఐఏలకు లేఖలు రాసినా పట్టించుకోని వైనం

సాక్షి, హైదరాబాద్‌: మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందా అమాయకులను అప్పులపాలు చేస్తోంది. గడిచిన మూడు నెలల్లో రాష్ట్ర పోలీసులు పట్టుకున్న కేసుల్లో రూ.20 వేల కోట్ల మేర మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో వేలాదిమంది మోసపోవడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం 1978లోనే చట్టాన్ని తీసుకువచ్చింది. మనీ సర్క్యులేషన్‌ స్కీం నిషేధిత యాక్ట్‌ కింద గిఫ్ట్‌ల పేరిట డబ్బులు వసూలు చేసి చెయిన్‌ లింక్‌ ద్వారా మార్కెటింగ్‌ చేయడం పూర్తిగా అక్రమమేనని ఈ చట్టం ద్వారా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో ఆమ్వే ప్రాడక్ట్‌పై ఇదే తరహా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇటీవల బయటపడుతున్న మల్టీలెవల్‌ కంపెనీ మోసాలు వేలకోట్లకు చేరడంతో రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మాఫియా చాపకింద నీరులా దందా సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.  

- హైదరాబాద్‌ కేంద్రంగా చేసుకుని గోల్డ్‌స్కీం పేరుతో దేశవ్యాప్తంగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్‌ మోసాన్ని నగర సీసీఎస్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆ గ్రూపు ఎండీ నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా రూ.8 వేల కోట్లకుపైగా నౌహీరా షేక్‌ బంగారం స్కీం పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్టు బయటపడింది.  
ఎఫ్‌ఎమ్‌ఎల్‌ సీ(ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దేశవ్యాప్తంగా రూ.1,200 కోట్ల వసూలు చేసింది. ఈ కంపెనీలో సభ్యులుగా చేరి, వారి వద్ద ఉన్న హెల్త్‌ ప్రొడక్టు కొనుగోలు చేయాలి. తర్వాత మరో ఇద్దరిని చేర్చి ప్రొడక్టు కొనుగోలు చేయించాలి. ఇలా చేయడం వల్ల నెలవారీగా ఇంత మొత్తం వస్తుందని డిపాజిట్‌ చేయిస్తారు. ఇలా రాష్ట్రంలో 650 మందిని మోసం చేసినట్టు గుర్తించారు.  
కరక్కాయల పౌడర్‌ పేరుతో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ చేస్తూ రూ.13 కోట్లు మోసం చేసిన వ్యవహారాన్ని ఛేదించారు. రూ.1,000 పెట్టి కిలో కరక్కాయలు కొని పౌడర్‌ చేసి ఇస్తే 1,300 రూపాయలకు కొనుగోలు చేస్తామని డిపాజిట్ల రూపంలో రూ.20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.  
హెల్త్‌ బిజ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ పేరుతో మెంబర్‌షిప్‌ చేయించి ప్రొడక్టు కొనుగోలు చేసి, మరో ఇద్దరితో డిపాజిట్‌ చేయిస్తే పెట్టిన డబ్బులు రెట్టింపు ఇస్తామంటూ రూ.30 కోట్ల మేర కొల్లగొట్టారు.  
సన్‌ పవర్‌ కంపెనీ పేరుతో రూ.200 కోట్ల మేర మోసం చేశారు. సభ్యులుగా చేరి, మరో ఇద్దరిని చేర్పిస్తే ప్రతి ఏడాదికి పెట్టిన డబ్బులతోపాటు వడ్డీ రెట్టింపు ఇస్తామంటూ మోసం చేశారు. స్టాక్‌ మార్కెట్‌లో సులభంగా డబ్బులు సంపాదించాలంటే తమ కంపెనీలో సభ్యులుగా నమోదవ్వాలంటూ డిపాజిట్ల పేరుతో బురిడీ కొట్టించారు. ఇలా 2 వేలమంది నుంచి రూ.2 వేల కోట్ల మేర వసూలు చేశారు.  
క్యూనెట్‌ కంపెనీ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. గతంలో ఇదే కంపెనీ నిర్వాహకులు గోల్డ్‌క్వెస్ట్‌ పేరుతో రాష్ట్రంలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ నిర్వహించి రూ.800 కోట్లకుపైగా అమాయకులకు ఎగనామం పెట్టారు.  
ఇప్పుడిదే నిర్వాహకులు పేరు మార్చి క్యూ–నెట్‌ పేరుతో దందా ప్రారంభించారు. సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ప్రొడక్ట్‌ కొనుగోలు చేసి సభ్యత్వం పేరుతో వసూలు చేసినట్టు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపు తామని పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.

ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ వద్దా?
మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో ప్రచారం చేసినా, టీవీల్లో ప్రకటనలిచ్చినా, సంక్షిప్త సందేశాలతో ప్రలోభపెట్టినా దర్యాప్తు విభాగాలు నేరుగా సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. కానీ, బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పా ఇలాంటి మోసపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యవహారాలను గుర్తించడం, కట్టడి చేయడంతోపాటు రూ.వేల కోట్లు కొల్లగొట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్రంలో ‘ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ఏర్పాటు తప్పనిసరి అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఇన్‌కమ్‌ ట్యాక్స్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలకు రాష్ట్ర పోలీసులు లేఖలు రాసినా ఇంతవరకు దృష్టి సారించలేదని, ఇప్పటికైనా దృష్టి పెట్టాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top