► పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్న షీ టీమ్స్
► విద్యార్థినులు, మహిళలరక్షణకు ప్రత్యేక బృందాలు
► కౌన్సెలింగ్‌తో పలుసమస్యలకు పరిష్కారాలు
► ఎందరికో భరోసా ఇస్తూ ముందుకు..
► సవాళ్లను ఎదుర్కొంటూనే సత్ఫలితాలు
ఆమెకు అండగా ఓ సైన్యమే ఉంది. ఎక్కడ ఎలా నిఘా ఉంచుతారో.. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటారో, ఎవరిని గమనిస్తున్నారో తెలియనంత నిఘా. ఒక్క కాల్‌చేస్తే చాలు.. క్షణాల్లో వాలిపోతారు. వ్యూహచతురతతో ఆకతాయిల పనిపడుతున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇదే షీ టీమ్ నిత్యకార్యాచరణ.
మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంగా షీ బృందం అందిస్తున్న సేవలు సత్ఫలితాలనిస్తోంది. సవాళ్లను ఎదుర్కోవాలంటూ యువతులలో చైతన్యం నింపేందుకు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులు, యువతులు, మహిళల రక్షణ కోసం 2015 ఏప్రిల్‌లో షీ టీమ్ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. నిర్ధిష్టమైన మార్గదర్శకాలతో మొదలైన ఈ వినూత్న కార్యక్రమం అతివలందరూ మెచ్చేలా మంచి ఫలితాలను సాధిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఠక్కున వాలిపోయి కీచకుల అరాచకాలను అడ్డుకుంటారు. సమస్య తీవ్రత, బాధితుల కోరిక మేరకు అవసరమైతే నిందితులపై కేసులు నమోదు చేసి ఊచలు లెక్కించేలా చేస్తారు. ఇదే సమయంలో సమస్య నేపథ్యాన్ని విశ్లేషించడం, అవసరమైన మేరకే నిందితులపై చర్యలు తీసుకోవడంలో, మానవతా కోణాన్ని ఆవిష్కరిస్తుండటంతో జనం మెప్పుపొందుతున్నారు. ఇప్పటి వరకు షీ టీమ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 12ఎఫ్‌ఐఆర్‌లు, 120వరకూ సాధారణ కేసులు నమోదు చేశారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే స్వీకరిస్తున్నారు. మరో 200మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో పరివర్తనకు కృషి చేశారు.
ప్రేమ వేధింపులే అధికం: ఆకతాయి చేష్టలు, ప్రేమ పేరుతో వేధింపులు.. ఈ సమస్యలే షీ బృందాలకు ఎదురవుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ డిగ్రీ, పీజీ వరకు సీనియర్లు జూనియర్లను వేధిస్తున్న సందర్భాల్లో సహాయం అందించిన కేసులు చాలానే ఉన్నాయి.
సామాజిక మాధ్యమాలు: ఫేస్‌బుక్, వాట్సాప్ పరిచయాలు.. స్నేహం ముసుగులో ఎదురవుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీటీమ్ అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్‌బుక్‌లో వెల్లువలా వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెస్సేజ్‌లు చేసే వరకురావడం పలు కేసులలో గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు
బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీటీమ్‌ను ఆశ్రయించడం పరిపాటిగా మారుతున్నాయి. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, వేర్వేరు నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రాత్రి, పగలు తేడా లేకుండా ఫోన్ చేయడం మాట్లాడేటప్పుడు పెట్టేయడం.. కొన్నిసార్లు అసభ్యంగా మాటలు.. వందల సంఖ్యలో పట్టణంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేదన ఇది. పాతనంబర్ తీసేసి కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నా చాలామందికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంట్లో ఎవరికైనా చెబితే నీకు తెలియకుండా ఎవరు ఫోన్ చేస్తారు..? అర్ధరాత్రి కూడా స్నేహితులతో మాటలేంటి? అంటూ చీవాట్లు తప్పడంలేదు. ఇలాంటి వారి సమస్య పరిష్కరించేందుకు షీ బృందాలు పని చేస్తున్నాయి.
ఒంటరి మహిళలు ఒంటరిగా పనుల నిమిత్తం బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపులూ జిల్లాలో ఎక్కువగానే ఉన్నాయి. కొన్నాళ్లు వెంటబడ డం, పరిచయం చేసుకుని మాటలు కలపడం.. కొంతకాలం తర్వాత తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్న ప్రబుద్ధులు చివరకు పోలీస్ స్టేషన్లకు చేరుకుంటున్నారు.
రద్దీ ప్రాంతాలు: ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కళాశాలల ఎదుట, పాఠశాలల సమీపంలో విద్యార్థినులు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇలా సమస్య ఏదైతేనేం ఇల్లు విడిచి బయటికి వచ్చే యువతులు, మహిళలకు షీటీమ్
రక్షణ కవచంలా నిలుస్తోంది: .షీటీమ్‌కు సిబ్బంది సమస్య మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కోసం పనిచేస్తున్న షీటీమ్ ఇప్పుడు సిబ్బంది కొరతతో ఇబ్బందిపడుతోంది. ఒక ఇన్‌చార్జ్ సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, మరొక హోంగార్డు పని చేస్తున్నారు. వాస్తవానికి ఈ బృందానికి మరికొంత మంది సిబ్బంది తోడుగా ఉండాలి. ముఖ్యంగా బాధితులు మహిళలు కావడంతో వారి సమస్యలను స్పష్టంగా వివరించుకునేందుకు మహిళా సిబ్బందిని ఎక్కువగా నియమించాలి. మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌సీఐ సీతయ్య పర్యవేక్షణలో సాగుతున్న ఈ బృందం మరింత మెరుగైన ఫలితాలను సాధించాలంటే తగిన ఆధునిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.