నాలుగు రాష్ట్రాల భక్తులు మేడారం చేరుకునేందుకు అత్యంత కీలకమైన మల్యాల- ఊరట్టం రోడ్డు పనులకు వన్యప్రాణి ...
మేడారం ప్రధాన రహదారికి అటవీశాఖ అడ్డంకి
రెండేళ్లుగా నిలిచిన మల్యాల - ఊరట్టం రోడ్డు
నాలుగు రాష్ట్రాలకు ఇదే ముఖ్య మార్గం
ఏటూరునాగారం : నాలుగు రాష్ట్రాల భక్తులు మేడారం చేరుకునేందుకు అత్యంత కీలకమైన మల్యాల- ఊరట్టం రోడ్డు పనులకు వన్యప్రాణి విభాగం అధికారులు అడ్డు చెప్పడంతో రెండేళ్లుగా నిలిచిపోయాయి. 2014 మేడారం జాతర సమయంలో ఆర్‌అండ్‌బీ నుంచి రూ.5.60 కోట్ల నిధులు మంజూరయ్యూరుు. వీటితో సుమారు 11 కిలోమీటర్ల బీటీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మల్యాల కొత్తూరు నుంచి కంకర పోస్తుండగా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గత రెండేళ్లుగా అది మట్టిరోడ్డుగానే మిగిలిపోయింది. జాతర సమయంలో ట్రాక్టర్‌లు, ఇతర ప్రైవేటు వాహనాలను తాడ్వాయి మీదుగా మేడారం వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటారు. ఇందుకోసం అనేక మంది భక్తులు ఈ రోడ్డు నుంచే మేడారం చేరుకుంటుండేవారు. రోడ్డు పనులు చేపట్టకపోవడంతో ఇప్పుడు ఆ ప్రయూణికుల పరిస్థితి ఏంటనేది ప్రశార్థకంగా మారింది.
నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక దారి...
ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట గోదావరి నదిపై బ్రిడ్జి ఉండడంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ముల్లకట్ట బ్రిడ్జిపై నుంచి ఏటూరునాగారం చేరుకుంటారు. అక్కడి నుంచి చిన్నబోయినపల్లి, షాపెల్లి, దొడ్ల, మల్యాల, కొండాయి మీదుగా కొత్తూరు చేరుకొని ఊరట్టం దారి గుండా మేడారం వెళ్తుంటారు. ఏటూరునాగారం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం చేరుకోవడానికి ఇది అనువైన రహదారి. గతంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌లు, ద్విచక్ర వాహనాల పై ఈ దారి నుంచి మేడారం చేరుకునేవారు. అరుుతే ఇప్పుడు రోడ్డు అధ్వానంగా మారడం, అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఈ ఏడాది భక్తులకు రవాణా కష్టాలు తప్పేలా లేవు.
మల్యాల రోడ్డుకు అటవీశాఖ అడ్డు..
కళ్ల ముందు అడవిని నరికి వాహనాల్లో తరలిస్తుంటే మిన్నకుండా ఉండే అటవీశాఖ అధికారులు.. మేడారం వెళ్లే రోడ్డుకు మాత్రం అడ్డు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే కలప స్మగ్లింగ్ పెరుగుతుందని భావించిన అటవీ, వన్యప్రాణి విభాగం అధికారులు పనులను అడ్డుకున్నారు. ఈ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్లకూడదని కొర్రేడు వాగుపై నిర్మించిన కల్వర్టు పైపులను రెండేళ్ల క్రితం జేసీబీ ద్వారా తొలగించారు. పలు చోట్ల రోడ్లకు గండ్లు పెట్టి ఎడ్లబండ్లు కూడా వెళ్లకుండా చేశారు.
మల్యాల- ఊరట్టం రోడ్డు చేపట్టాలి
మల్యాల- ఊరట్టం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. గోవిందరాజులు ఈ రోడ్డు గుండానే మేడారం చేరుకుంటారని, రోడ్డును అభివృద్ధి చేస్తుంటే వన్యప్రాణి విభాగం అధికారులు అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.
కాగా, ఈ విషయమై అటవీశాఖ సెక్షన్ అధికారి(వణ్యప్రాణి విభాగం) ఝాన్సీరాణిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇది జంతువులు తిరిగే ప్రాంతం కావడంతో రోడ్డు పనులకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. రోడ్డు అభివృద్ధి చేస్తే కలప స్మగ్లింగ్ కూడా అధికమయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పారు.